Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
ఆపరేషన్ కగార్ ప్రభావంతో దేశవ్యాప్తంగా మావోయిస్టులు, కీలక నేతలు భారీ సంఖ్యలో పోలీసుల ఎదుట వరుసగా లొంగిపోతున్నారు.ఈ లొంగుబాటు అంటే సరెండర్ అనే ప్రచారాన్ని మావోయిస్టునేతలు ఖండించడం ఆశక్తిగా మారింది.

లీగల్ కావడం (Maoists surrender) మావోయిస్టు పార్టీ నుండి లేదా ఇతర నక్సలైట్ పార్టీ నుండి బయటకు వచ్చిన వారిని సరెండర్ అనడం సరైన పదం కాదు. వీరు ఏ అధికారికి ఏ పార్టీకి సరెండర్ కావడం లేదు. ఇల్లీగల్ గా కొనసాగుతున్న మావోయిస్టు పార్టీ నుండి లేదా ఒకనాడు నక్సలైట్ పార్టీల సాయుధ పోరాట మార్గం నుండి బయటకు రావడం అంటే లీగల్ కావడమే అవుతుంది. రాజ్యాంగవ్యతిరేక, చట్ట వ్యతిరేక హింస,ప్రతి హింస కార్యక్రమాల నుండి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన ప్రజాస్వామ్య కార్యక్రమాలు కొనసాగించడానికి, చట్టబద్ధంగా జీవించడానికి, తమ ప్రజాస్వామిక హక్కులు పొందడానికి అవకాశం కలిగి ఉండడమే లీగల్ కావడం అవుతుంది.
ప్రభుత్వ వర్గాలు దశాబ్దాల కాలం నుండి మొరటుగా సరెండర్ అనే పదజాలం ఉపయోగిస్తే, దానిని నక్సలైట్ పార్టీలు ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ దానిని మరింత ప్రచారం చేయడం మాత్రమే కాకుండా "కోపంతో కసితో మోకరిల్లినారు"అని తమ వ్యంగ్యమైన పదజాలంతో ఆ పార్టీల నుండి వచ్చిన వారిని తీవ్రంగా అవమానించారు. ఈ అవమానం సమాజంలో వారికి సాధారణ ప్రజలకు ఉండే గౌరవం కూడా లేకుండా చేశారు.
లొంగిపోయిన వారు ద్రోహులు అవుతారా..
దశాబ్దాల తరబడి ఆస్తులు కుటుంబాలు, ఉద్యోగాలు అనుబంధాలు వదిలి అనేక పోలీసు దాడుల మధ్య త్యాగానికి సిద్ధపడి పని చేసిన వారిని ద్రోహులని, మోకరిల్లి నారు , దిగజారినారు, మాజీలు అంటే నాజీలు అని ప్రచారాలు చేసినారు. నాజీలకు మాజీలకు పోలిక ఏ విధంగా ఉంటుందో కనీసం ఆలోచించకుండా పార్టీ నుండి బయటకు రావడమే ఒక తీవ్రమైన నేరంగా కసి ,ద్వేషంతో మాట్లాడటమే వీరికి విప్లవ కార్యక్రమంగా మారిపోయింది. వీరి అవగాహన అల్ప బుద్ధితో కూడుకున్న, సంకుచితమైన భావజాలమే తప్ప కమ్యూనిస్టు భావజాలం ఎంత మాత్రం కాదు. పార్టీ లేదా గెరిల్లా దళ జీవితం వదిలివేసి రావడానికి అనారోగ్యం, వయసు మీద పడడం, వ్యక్తిగత సమస్యలు, ఉద్యమ ఎగుడుదిగుడులకు తగిన విధంగా మారకపోవడం, ఉద్యమంపై, నాయకత్వంపై, పార్టీపై విశ్వాసం కోల్పోవడం, వగైరా అనేక విషయాలు కారణాలు అవుతాయి. కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, చాలామందికి ఉద్యమంపై ,పార్టీపై, విప్లవం పై విశ్వాసం కోల్పోయినప్పటికీ వాటిని చర్చించకుండా అనారోగ్యముతో పార్టీ నుండి బయటకు వస్తున్నట్టు చెప్తారు.సైద్ధాంతిక రాజకీయ కారణాలతో చెప్పేవారు ఉన్నప్పటికీ అలాంటి వారు బహిరంగంగా అరుదుగా మాత్రమే ఉంటారు.
మావోయిస్టు పార్టీ నుండి గ్రామ సంఘాల నుండి కేంద్ర కమిటీ మెంబర్స్ వరకు పార్టీని వదిలి బయటకు వచ్చిన వారు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉంటారు. అలా వచ్చిన వారిలో 99% పైగా పేద వర్గాలు. తమ వ్యక్తిగత జీవితంలో అనేకంగా కోల్పోయినప్పటికీ అనేక ఇబ్బందులతో సాధారణ జీవితం గడుపుతున్నారు. పార్టీని వదిలి వేసిన తర్వాత అతికొద్దిమంది తాము నేర్చుకున్న రాజకీయాలను కమ్యూనిస్టు విలువలను పూర్తిగా వదిలివేసి ప్రజా వ్యతిరేకులుగా , లంపెన్స్ గా, అరాచకులుగా, ఇన్ ఫార్మర్లుగా, బూర్జువా పార్టీ నాయకులుగా మారిన వారు ఉన్నారు. అలాంటి వారిని నిర్దిష్టంగా విమర్శించాలి కానీ గంపగుత్తగా పార్టీ నుండి వెళ్లి వచ్చిన అందరిపై శత్రు పూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా విప్లవానికే నష్టం అని గుర్తించాలి.
జనజీవన స్రవంతిలోకి వస్తే...
వివిధ నక్సలైట్ పార్టీల నుండి లేదా మావోయిస్టు పార్టీ లోకి పోయినవారు ప్రజలను ఉద్యమాలకు సంఘటిత పరుస్తూ ప్రజలలోనే ప్రజల కొరకు ఉన్న విషయం అందరికీ అర్థమయ్యే విషయమే అయినప్పటికీ , పార్టీ నుండి బయటకు వచ్చే వారిని ప్రభుత్వం లేదా మీడియా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్టుగా వ్యాఖ్యానించడం గత 30 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు. ఈ విధంగా వ్యాఖ్యలు సరైనది కాదు అని స్వయంగా మావోయిస్టు పార్టీ అనేక దఫాలుగా చెప్పినప్పటికీ ప్రభుత్వ వర్గాలు, మీడియా పాత పాటనే ఎప్పుడు పడుతూనే ఉన్నది.
ప్రజల కోసం పనిచేయడం..
గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో పాటుగా మావోయిస్టు పార్టీ అనుసరించిన వైఖరి మూలంగా మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన వారిలో దాదాపు ఎక్కువమంది కమ్యూనిజం కోసం గాని, లేదా ఇతర ప్రజాస్వామిక కర్తవ్యాల కోసం కానీ పనిచేయలేకపోయినారు. వారికి తగిన ప్రోత్సాహం లేకుండా ,నిరాశపూరితమైన గందరగోళమైన వాతావరణం కారణమైంది.మావోయిస్టు పార్టీ నుండి వివిధ కారణాల మూలంగా బయటకు వచ్చినప్పటికీ ప్రజల కోసం తాము నేర్చుకున్న కమ్యూనిస్టు రాజకీయాలను, కమ్యూనిస్టు విలువలను వదులుకోకుండా ప్రజల కోసం తమ శక్తి మేరకు రాజ్యాంగ పరిధిలో కమ్యూనిజం కోసం పనిచేయడానికి కృషి చేయవచ్చు. లేదా అనేకమైన ప్రజా సమస్యల కోసం వివిధ ప్రజాస్వామిక వేదికలలో సైతం క్రియాశీలంగా పనిచేయడానికి ఆలోచిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది.
-జంపన్న ( డెమోక్రటిక్ సోషలిస్ట్)





















