Pawan Kalyan: కేంద్రం సాహసోపేత నిర్ణయం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం: బడ్జెట్‌పై పవన్ కళ్యాణ్
Union Budget 2025 | అమరావతికి రూ.15,000 కోట్లను కేటాయిస్తూ, మరింత సహకారం అందిస్తాం అని చెప్పడం రాజధాని నిర్మాణం సజావుగా, వేగవంతంగా సాగేందుకు ఉపయోగపడనుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

అమరావతి: దేశ అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు వికసిత్ భారత్ విజన్ (Viksit Bharat 2047) ను ప్రధాని మోదీ ప్రకటించారని పేర్కొన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget 2025)పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని కితాబిచ్చారు.
‘రాజకీయ ప్రయోజనాల కంటే దేశం, ప్రజలు ముఖ్యమనే కేంద్ర ప్రభుత్వ దృక్పథం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించింది. మధ్యతరగతి ప్రజలు, యువత, రైతులు, మహిళలు... ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని బడ్జెట్లో ప్రతిబింబించారు. రూ.10 లక్షల విలువ చేసే క్రెడిట్ కార్డులు మంజూరుతో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల (MSME)కు ఊతం దొరుకుతుంది. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఏకంగా రూ.2 కోట్ల వరకు రుణాలతో వారి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది.
కేంద్రం సాహసోపేత నిర్ణయం
వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షల వరకు ఇవ్వడంతో ఉద్యోగులకు, ఆదాయం ఆర్జించే వారికి భారీ ఊరట లభిస్తోంది. ఒకేసారి 5 లక్షల పన్ను మినహాయింపు చేస్తూ 12 లక్షలకు పెంచడం సాహసోపేత నిర్ణయం. ఇలాంటి సంస్కరణలు కచ్చితంగా మధ్యతరగతి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తాయి. బడ్జెట్ లో 2.66 లక్షల కోట్ల నిధులను గ్రామీణాభివృద్ధికి కేటాయించడం ద్వారా, రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు సాధించే ఆస్కారం లభించింది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగించడం ద్వారా ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్ అందించాలనే ఆశయాన్ని సాధించేందుకు తోడ్పడనుంది. పీఎం ధన్ ధాన్య యోజన (PM Dhan Dhanya Krishi Yojana) ద్వారా వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుంది. గిడ్డంగుల నిర్మాణం, నీటిపారుదల పనులు, రుణాలు అందించడం ద్వారా రైతులకు కేంద్రం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కిసాన్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచడం సంతోషంగా ఉందన్నారు’ పవన్ కళ్యాణ్.
ఏపీకి కేటాయింపులపై పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, అండదండలు కేంద్ర బడ్జెట్లోనూ కనిపించాయన్నారు పవన్ కళ్యాణ్. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంతో పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కి రూ.5,936 కోట్లు, నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం, పోలవరం అథారిటీకి అదనంగా మరో రూ.54 కోట్లు కేటాయించి, బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు ప్రకటించడాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ (Vizag Steel Plant)కి రూ.3,295 కోట్లు కేటాయింపులతో దాని పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టమైందన్నారు. విశాఖపట్నం పోర్టుకు కేంద్రం రూ.730 కోట్లు కేటాయింపులతో పోర్టు సామర్ధ్యం పెరిగి, మరింత వ్యాపారం జరిపే అవకాశం ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్.
Also Read: Budget 2025: కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌ల వల్ల సామాన్యుడికి ఎంత ప్రయోజనం లభిస్తుందో తెలుసా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

