Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
డిసెంబర్ 31 అంటే సుక్క, ముక్క లేకుండా దావత్ అనేది ఉండదు. అందుకే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఒక్క రాత్రిలో 350 కోట్ల అమ్మకాలతో ఆల్ టైం రికార్డ్ నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలలో ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత క్రిస్మస్, ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు రావడంతో మందుబాబులు పోటీపడి మద్యం కొనుగోళ్లు చేశారు. దీంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఎక్సైజ్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 3 రోజుల్లో మొత్తంగా 1000 కోట్ల వ్యాపారం జరిగింది. అదే 5 రోజుల్లో 1350 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తంగా డిసెంబర్ నెలలో 5 వేల కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్‌లో 3800 కోట్ల మద్యం విక్రయాలు మాత్రమే జరిగాయి. అంటే లాస్ట్ ఇయర్ రికార్డ్‌ను బ్రేక్ చేయడమే కాకుండా.. తెలంగాణ చరిత్రలోనే ఒక నెలలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు కావడంతో స్టేట్ హిస్టరీలోనే ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ అయింది.
ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కారణంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగి.. డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో రూ.520కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. 31న 370కోట్లకు పైగా మద్యం అమ్మకాలతో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ అయినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతివ్వడం వల్లే ఈ స్థాయిలో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభించిన యజమానులకు భారీగా లాభాలు రావడంతో పాటు ఎక్సైజ్ శాఖకు కూడా లాభాల పంట పండినట్లు తెలుస్తోంది.





















