U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
U19 Women's T20 World Cup News: వరుసగా రెండోసారి ఈ టోర్నిని భారత్ కైవసం చేసుకోవడం విశేషం.2023లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టోర్నీలో గెలిచి, ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ ను నిలబెట్టుకుంది.

Gongadi Trisha All Round Show: తెలంగాణ ప్లేయర్ గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ ( 3/15, 33 బంతుల్లో44 నాటౌట్ , 8 ఫోర్లు) కనబర్చడంతో ఐసీసీ అండర్-19 మహిళా ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి ఈ టోర్నిని భారత్ కైవసం చేసుకోవడం విశేషం. 2023లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టోర్నీలో గెలిచి, ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా తన టైటిల్ ను నిలబెట్టుకుంది. ఆదివారం మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్లతో విజయం సాధించింది. టాస్ నెగ్గి, తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. జట్టులో మీక్ వాన్ వూస్ట్ (18 బంతుల్లో 23, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవీ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనను భారత్ 11.2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 84 పరుగులు చేసి పూర్తి చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ రాణించిన త్రిష జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
India retain the #U19WorldCup after a rampant display in the final 🤩#SAvIND pic.twitter.com/magfylVYs6
— ICC (@ICC) February 2, 2025
కుప్పకూల్చిన బౌలర్లు..
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేయాలనే సౌతాఫ్రికా నిర్ణయం బెడిసి కొట్టింది. ఆరంభంలోనే ఓపెనర్ సిమోన్ లౌరెన్స్ (0), దియార రాంలఖన్ (3), కెప్టెన్ కేలా రేనేక (7) వికెట్లు కోల్పోవడంతో ఆరంభంలోనే 20/3తో నిలిచింది. ఈ దశలో ఓపెనర్ జెమ్మా బోథా (16), వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మెసో (10) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. చాలా నెమ్మదిగా ఆడిన జంట.. బౌలర్లను బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయారు. నాలుగో వికెట్ కు 45 బంతుల్లో 20 పరుగులు మాత్రమే జత చేశారు. తర్వాత వరుస ఓవర్లలో వీరిద్దరిని భారత బౌలర్లు పెవిలియన్ కు పంపడంతో 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వూస్ట్, షే కౌలింగ్ (15) ఇన్నింగ్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒక్కో పరుగు జత చేస్తూ ఆరో వికెట్ కు 30 పరుగులు జత చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఇక వూస్ట్ ను ఔట్ చేసిన బౌలర్లు, టెయిలెండర్లను కూడా చకచకా పెవిలియన్ కు పంపడంతో సౌతాఫ్రికా కోలుకోలేక పోయింది. అది సాధారణమైన స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా ఇప్పటివరకు బ్యాట్ తో సత్తా చాటిన త్రిష.. తన లెగ్ బ్రేక్ బౌలింగ్ తో సత్తా చాటి మూడు కీలక వికెట్లు తీసింది.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆#TeamIndia 🇮🇳 are the ICC U19 Women’s T20 World Cup 2025 Champions 👏 👏
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
Scorecard ▶️ https://t.co/hkhiLzuLwj #SAvIND | #U19WorldCup pic.twitter.com/MuOEENNjx8
త్రిష దూకుడు..
83 పరుగులు సాధారణ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు అదిరే శుభారంభం దక్కింది. తొలి వికెట్ కు ఓపెనర్ కమిలిని (8)తో కలిసి 36 పరుగులను త్రిష జత చేసింది. కమలిని నెమ్మదిగా ఆడగా, త్రిష దూకుడుగా ఆడింది. బౌండరీలతో ప్రత్యర్థిని కొలుకోనీయకుండా చేసింది. ఆ తర్వాత కమిలిని వెనుదిరిగినా, త్రిష తన జోరును తగ్గించలేదు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. వన్ డౌన్ బ్యాటర్ సానికా చాల్కే (22 బంతుల్లో 26, 4 ఫోర్లు) కూడా జోరు ప్రదర్శించడంతో మరో వికెట్ పడకుండా భారత్ విజయతీరాలకు చేరింది. దాదాపు ఏడున్నరకుపైగా రన్ రేట్ తో భారత్ టార్గెట్ ను చేరింది. కమలిని వికెట్ ను కేలా రీనేక్ తీసింది. ఈ విజయంతో అజేయంగా టోర్నీని భారత్ నెగ్గినట్లయ్యింది. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా చవిచూడకుండా భారత్ గెలుపొందింది. మరోవైపు దురదృష్టాన్ని జేబులో వేసుకుని తిరుగుతుందనే పేరున్న సౌతాఫ్రికా.. ఫైనల్లోనూ అదే తరహా ఆటతీరు ప్రదర్శించింది. అనవసర ఒత్తిడికి తలొగ్గి, వెంట వెంటనే వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్ పురుషుల విభాగంలోనూ భారత్ చేతిలోనే సౌతాఫ్రికా ఓడిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన త్రిషకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీలోనే అత్యధిక పరుగులు (309 పరుగులు), 7 వికెట్లు సాధించిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. కాగా టోర్నీని తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు త్రిష భావోద్వేగంతో ప్రకటించింది.
Read Also: ICC Champions Trophy: ఫైనల్ చేరేవి ఆ రెండు జట్లే.. జోస్యం చెప్పిన పాంటింగ్, రవి శాస్త్రి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

