SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
SLBC Tunnel News: ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే టన్నెల్ లోపల మట్టిదిబ్బలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. అక్కడే 8 మంది కార్మికుల మృతదేహాలున్నట్లు తెలుస్తోంది.

SLBC Tunnel News: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు, 13వరోజుకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకూ వేగంగా జరిగిన రెస్య్కూ ఆపరేషన్ పనులు కాస్త నెమ్మదించాయి. దీనికి ప్రధాన కారణం టన్నెల్ లోపల ఇన్నాళ్లు ద్రవరూపంలో ఉన్న బురద కాస్త, ఇప్పడు మట్టి దిబ్బలుగా మారిపోయింది. దీంతో ఆ దిబ్బలను బయటకు పంపించినప్పుడే రెస్య్కూ ఆపరేషన్‌కు ముందడుగు పడుతుంది. మొదటి వారం రోజులపాటు టన్నెల్‌లో కొంత దూరం వరకూ రెస్య్కూ టీం వెళ్లగలిగారు. ఆ తరువాత ఎప్పుడైతే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, హైడ్రాకు తోడుగా ఆర్మీ, ఆ తరువాత దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది, జెపి కంపెనీ సిబ్బంది, రాబిన్ కంపెనీ సిబ్బంది ఇలా అవసరాన్ని బట్టి ఒక్కొక్కరుగా రంగలోకి దిగారు. ఒక్కో షిఫ్టుకు ఒక్కో విభాగం నుంచి 5 లేదా 10 మంది సిబ్బంది, మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇంతలా శ్రమించి దాదాపు, చివరి దశకు రెస్య్కూ ఆపరేషన్ తీసుకొచ్చారు. మొదట్లో పూర్తిగా నిలిచిపోయిన కన్వేయర్ బెల్టును గతంలా పని చేసేలా చేయడంతోపాటు, మూడు రోజులుగా ఆ కన్వేయర్ బెల్టు సహాయంతో ఏకంగా గంటకు 800 టన్నుల బురదను టన్నెల్ లోపలి నుంచి బయటకు తెస్తున్నారు.
అయితే ఇప్పడు కన్వేయర్ బెల్టు పని చేస్తున్నా, లోపల నుంచి బురదను బయటకు తెచ్చే అవకాశం లేదు. ద్రవరూపంలో ఉన్న బుదరకాస్త ఏకంగా 12రోజులు దాటిపోవడంతో లోపల మట్టి దిబ్బలుగా మారిపోయింది. జిపిఆర్ స్కానర్ సహయంతో టన్నెల్ లోపల మొదట 5 అనుమానిత ప్రాంతాలను గుర్తించి, అక్కడే కార్మికులు ఉండి ఉండొచ్చని భావించారు. ఆ ప్రాంతం వరకూ మట్టి , టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు తొలిగించినప్పటికీ అక్కడ కార్మికుల జాడలేదు. మరో 4 ప్రాంతాను జిపిఆర్ స్కార్ ద్వారా గుర్తించి ఇప్పుడు అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే తాజాగా టన్నెల్ లోపల దిబ్బలుగా మారిన మట్టి ఇప్పుడు రెస్యూ ఆపరేషన్‌కు ప్రధాన అటంకంగా మారింది. అందుకే ఇన్నాళ్లు జరిగినంత వేగంగా టన్నెల్ లోపల నుంచి శకలాలు బయటకు తెచ్చే ప్రక్రియ ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. తాజాగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మట్టి దిబ్బలను ఫైరింగ్ జట్ పంప్స్ సహాయంతో ముక్కలుగా చేసి, ప్రొక్లేన్ల సహాయంతో బయటకు తెచ్చే పనిని వేగవంతం చేశారు. ఆయితే భారీ క్రేన్‌లు లోపలికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి చిన్న ప్రొక్లేన్ల ద్వారా మట్టిని, కన్వేయర్ బెల్టుపైకి అక్కడి నుంతి టన్నెల్ బయటకు పంపింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే టన్నెల్ లోపల పూర్తిగా ధ్వంసమైన టిబిఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్) శకలాలు తొలిగింపు ఇంకా పూర్తి కాలేదు. 140 మీటర్లు, 1500 టన్నుల బరువుంటే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలు పూర్తిగా టన్నెల్ బయటకు తెచ్చేందుకు లోపల మట్టిదిబ్బలు ఇప్పుడు ప్రధాన ఆటంకంగా మారాయి. 3 నుంచి 8 మీటర్ల లోతులో మట్టిదిబ్బలు ఉండగా అందులో కొంత భాగం ఇప్పటి వరకూ తొలగించారు. ఇప్పుడు మిగిలిన బురదమట్టి తొలిగించి, టిబిఎం శకలాలు కూడా పూర్తిగా బయటకు తెస్తేనే టన్నెల్ లోపల మట్టిదిబ్బల్లో ఉన్న కార్మికుల జాడ దొరకనుంది. ఈ క్రమంలో ఓ వైపు కన్వేయర్ బెల్టు తిరుగుతూ, మరోవైపు యంత్రాలతో మట్టి దిబ్బలను ముక్కలుగా చేస్తున్న క్రమంలో కార్మికులను గుర్తుపట్టడం కూడా కష్టంగా మారే అవకాశాలున్నాయి. ఏ మాత్రం చెక్కుచెదరని సంకల్పంతో, ఆటంకాలను దాటుకుంటూ రెస్య్కూ సిబ్బంది మాత్రం టన్నెల్ ఆపరేషన్‌లో ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో సాధ్యమైనంత త్వరగా ఎస్ ఎల్ బిసి ఉత్కంఠతకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్





















