Jagga Reddy movie: టాలీవుడ్‌లోకి జగ్గారెడ్డి ఎంట్రీ - లవ్ స్టోరీలో ప్రధాన పాత్ర - ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకంటే ?
Actor Jaggareddy: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సినిమాలో నటించేందుకు సిద్దమయ్యారు. ఆయన పేరుతోనే సినిమా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని జగ్గారెడ్డి ప్రకటించారు.

Jagga Reddy As Actor: సంగారెడ్డికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నటనా రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వరలోనే తాను సినిమా రంగంలోకి వస్తున్నానని జగ్గారెడ్డి స్వయంగా ప్రకటించారు. ఓ ప్రేమ కథలో తాను ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా చెప్పారు. నా ఒరిజనల్ క్యారెక్టర్ కు సినిమాలోని రోల్ అద్దం పట్టేలా ఉంటుదని అందుకే సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. పీసీసీ, సిఎం ల అనుమతి తీసుకుంటానన్నారు. అయితే ఈ సినిమా స్టోరీని ఇంత వరకూ వినలేదని.. ఈ ఉగాదికి సినిమా స్టోరీ వింటాననన్నారు. వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుందని ముహుర్తం ఖరారు చేశారు. ఈ సినిమాను ఎవరు తీస్తున్నారు.. దర్శకుడు ఎవరు అన్నది జగ్గారెడ్డి చెప్పలేదు కానీ.. ఒక వ్యక్తి కలిసి.. నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పాడన్నారు. సినిమాలో నటించమని అడిగారన్నారు. ఇంటర్వల్ ముందు మొదలయ్యే పాత్ర, సినిమా చివరి వరకు ఉంటుందన్నారు.
జగ్గారెడ్డి సీనియర్ నేత. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా పలు పార్టీల్లో పని చేశారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆయన ఓడిపోయారు. గెలిచి ఉంటే తనకు మంత్రి పదవి వచ్చేదని ఆయన ఫీలవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన గట్టిగానే ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డి మాత్రం తనకు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించలేదని జెట్టి కుసుమకుమార్ కోసం ప్రయత్నించానని చెబుతున్నారు. పార్టీలో ఆయనకు పెద్దగా పని లేదు.. ప్రభుత్వంలోనూ ఆయనకు ఎలాంటి పదవి లభించలేదు. దాంతో రాజకీయంగా ఖాళీగా ఉన్నారు.
ఈ క్రమంలో ఆయన సినిమా రంగంపై అదీ కూడా నటనా రంగంపై దృష్టి పెట్టడం కాంగ్రె్స వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గతంలో తనకు జగ్గారెడ్డి అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆయన స్ట్రెయిట్ రాజకీయాలు చేస్తారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దాడులు చేస్తున్నారని తెలిసినా సరే జగ్గారెడ్డి సమైక్యవాదం వినిపించారు. అందుకే ఒక మాట మీద నిలబడే నాయకుడు అని ఆయనను పవన్ అభినందించేవారు. ఇప్పుడు నేరుగా జగ్గారెడ్డి సినిమాల్లోకే ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అండగా నిలిచే అవకాశం ఉంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో రామిరెడ్డి తర్వాత ఆ స్థాయి కటౌట్ ఉన్న విలన్ ఇప్పటి వరకూ లేరని .. సినీ ప్రేమికులు చెబుతూంటారు. ఇప్పుడు జగ్గారెడ్డి తన మొదటి సినిమాలో బలమైన ముద్ర వేస్తే.. చాలా సులువుగా ఆయన టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న నటుడిగా మారే అవకాశం ఉంది. అయితే ఇది తన క్యారెక్టర్ కు దగ్గరగా ఉంది కాబట్టే అంగీకరించానని పూర్తి స్థాయిలో నటుడిగా మారే ఉద్దేశం లేదని జగ్గారెడ్డి అనుచరులకు చెబుతున్నారు. అయితే రాజకీయాలపై పూర్తిగా విముఖంగా ఉన్న ఆయన .. వారసులను ఇప్పటికే ప్రజల్లోకి పంపుతున్నారు. ఇక సినిమాలపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.
Also Read: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు





















