PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Vande Mataram Debate: వందేమాతరంపై చర్చ ప్రారంభమైంది. ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడారు. స్వాతంత్ర్య సమయంలో ఈ పేరుతో పత్రికను ఎవరు ప్రారంభించారో తెలుసుకోండి.

Vande Mataram Debate | లోక్‌సభలో వందేమాతరంపై చర్చ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు. ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ, 'మన అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధులు వందేమాతరం అని నినదించి ఉరిశిక్షను స్వీకరించారు. వివిధ జైళ్లలో ఇది జరిగింది. కానీ అందరి నోటా మంత్రం ఒక్కటే వందేమాతరం. అదే సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో ప్రారంభించిన, వందేమాతరం పేరుతో ఉన్న వార్తాపత్రికలు కొన్ని ఉన్నాయని’ ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో ఈ వార్తాపత్రికలను ఎవరు ప్రారంభించారో తెలుసుకుందాం, దీని గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం పత్రిక ప్రారంభం
వందేమాతరం అనే పేరు భారతదేశంలో చాలా శక్తివంతమైనది. కోట్లాది మందికి ఆ పదం, నినాదం స్ఫూర్తిదాయకం. ఇది నినాదాలతో పాటు మీడియాలో కూడా కనిపించింది. ఆ సమయంలో ప్రెస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అత్యంత బలమైన ఆయుధాలలో ఒకటి వందేమాతరం. చాలా మంది జాతీయవాద నాయకులు ప్రజలలో అవగాహన పెంచడానికి, వలస విధానాలను సవాలు చేయడానికి ఇదే పేరుతో వార్తాపత్రికల్ని ప్రారంభించారు.
బిపిన్ చంద్ర పాల్ మొదటి బందేమాతరం పత్రిక
ఆగస్టు 1906లో జాతీయవాద నాయకుడు బిపిన్ చంద్ర పాల్ కోల్‌కతా నుంచి 'బందేమాతరం' పేరుతో ఒక ఇంగ్లీష్ వారపత్రికను ప్రారంభించారు. జాతీయ గౌరవాన్ని పెంపొందించడం, స్వదేశీ అంశాన్ని ప్రోత్సహించడం, భారతీయుల రాజకీయ ఆకాంక్షలను సమాజంలోని ఇంగ్లీష్ మాట్లాడే వర్గాలకు చేరవేయడం ఆయన ప్రధాన లక్ష్యం. బిపిన్ చంద్ర పాల్ ప్రచురణ త్వరలోనే మేధోపరమైన ఆయుధంగా మారిపోయింది.
మహర్షి అరబిందో ఘోష్ సంపాదకుడిగా బాధ్యతలు
వార్తాపత్రిక ప్రారంభించిన వెంటనే అరబిందో ఘోష్ వందేమాతరం సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పత్రికను వీక్లీ నుంచి డైలీగా మార్చారు. ఈ పత్రికను కాంగ్రెస్ లోని గ్రూపునకు అత్యంత ప్రభావవంతమైన స్వరంగా మార్చారు. అరబిందో సంపాదకీయాలు ఉద్రేకపూరితంగా, రాజీలేని జాతీయవాదంతో ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఈ పత్రికను చాలా ప్రమాదకరమని భావించింది. దీనిని నేరుగా 1910 ప్రెస్ చట్టం వంటి కఠినమైన చట్టాలకు ఒక కారణంగా పేర్కొంది. ఈ చట్టం విప్లవాత్మక ఆలోచనలను అణచివేయడానికి రూపొందించారు.
భికాజీ కామా పారిస్ నుంచి వందేమాతరం పత్రిక ప్రారంభం
మేడమ్ భికాజీ కామా 1909లో పారిస్ నుండి వందేమాతరం పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు. ఈ పేపర్ లక్ష్యం భారతదేశంలో జాతీయవాదం, బ్రిటిష్ వ్యతిరేక భావాలను ప్రోత్సహించడం. దీని కోసం మేడమ్ భికాజీ కామా పారిస్‌లో పారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించి, దాని ద్వారా ఈ పత్రికను ప్రచురించారు. ఈ పత్రికను బ్రిటిష్ నిషేధానికి ప్రతిస్పందనగా విదేశాలలో ప్రారంభించారు.






















