Hyderabad Crime News: నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
హైదరాబాద్ లో పట్టపగలు దారుణ హత్య సంచలనంగా మారింది. అందరూ చూస్తుండగానే కాల్పుల మోత జనాలను హడలెత్తించింది. కళ్ల ముందే కత్తులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రాణాలు తీశారు.

మేడ్చెల్ జిల్లా , జవహార్ నగర్ పీఎస్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట రత్నం అత్యంత కిరాతకంగా హత్యకు గురైయ్యారు. సాకేత్ కాలనీలో పోస్టల్ బిల్లా బాంగ్ స్కూల్ వద్ద తన కూతురుని యాక్టీవా బైక్ పై దింపి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ లో పాపను దించి అలా స్కూల్ దాటిన కొద్ది క్షణాల్లో తండ్రి వెంకట రత్నం ప్రాణాలు తీసారు. పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా స్కూల్ సమీపంలో మాటువేసిన దుండగులు , వెంకటరత్నం బైక్ ను వెంబడించారు. ఆటోలో నలుగురు, బైక్ పై మరో ఇద్దరు ఫాలో అవుతూ వచ్చారు. స్కూల్ దాటిన కొద్ది సేపటికే ముందుగా బైక్ పై ఉన్న దుండగులు వెంకటరత్నంపై తుపాకీతో కాల్పులు జరిపారు.
కాల్పుల దాటికి బైక్ పై నుండి క్రింద పడిన వెంకటరత్నంపై వెంటనే ఆటోలో వచ్చిన నలుగురు దుండగలు, తమ వెంట తెచ్చుకున్న కత్తులతో అత్యంత కిరాతంగా నరికి చంపారు.నడి రోడ్డుపై చుట్టూ జనసంచారం ఉండగానే రియల్టర్ హత్యకు గురుకావడంతో స్దానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హత్యను అడ్డుకునే సహాసం ఎవరూ చేయలేకపోయారు. కత్తిపోట్లకు వెంకటరత్నం ప్రాణాలు కోల్పోయాడని నిర్దారించుకున్న తరువాత ఆటోలో అక్కడి పరారైయ్యారు నిందితులు..
హత్య వెనుక కారణాలివేనా..
రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా విజువల్స్ సేకరించిన పోలీసులు , నిందితులు వచ్చిన ఆటో, బైక్ లను గుర్తించారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గతంలో దూల్ పేట్ లో మృతుడు వెంకటరత్నంపై జంట హత్యల కేసులో పలు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా దూల్ పేటలో జరిగిన కొన్ని గొడవల కారణంగా రౌడీ షీట్ నమోదైయ్యింది. ఈ నేపథ్యంలో పాత కక్షలే రియల్టర్ ప్రాణాలు తీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో ధూల్ పేట్ లో జంట హత్యల కేసులో వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గురైన వారి బంధువులు, స్నేహితుల సమాచారంపై కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉంటే వెంకటరత్నం హత్య విషయం తెలుసుకున్న బంధులు ఘటనాస్దలం వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్న ఘటన అందరికీ కలచివేసింది. బిడ్డను స్కూల్ కు పంపిన కొద్ది క్షణాల్లోనే తండ్రి విగతజీవిగా మారడంతో తీవ్ర విషాదం నెలకొంది.
ఇటీవల కాలంలో గన్ కల్చర్ హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెరిగిపోయింది. పట్టపగలు నాటు తుపాకీతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పగబడితే చాలు కత్తులతో జనసందోహం మధ్యలోనే దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు. జవహార్ నగర్ లో రియల్టర్ హత్యను సీరియస్ గా తీసుకున్న పోలీసులు తుపాకీ ఎలా లభించింది, ఎప్పటి నుండి హత్యకు ప్లాన్ చేసుకున్నారు. పాత కక్షలు కాకుండా మరేఇతర కారణాలున్నాయా అనే కోణం కూడా విచారణ చేపట్టారు.సీసీ కెమెారాలో హత్య జరిగిన తీరు ,ఆధారాలను పరిశీలిస్తున్నారు.





















