Telangana Rising Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. టార్గెట్ లక్షల కోట్ల పెట్టుబడులు, 2 రోజులపాటు జరిగే ఈవెంట్ షెడ్యూల్
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఇందుకుగానూ ప్రభుత్వం పలు దేశాల ప్రతినిధులను ఆహ్వానించింది.

Telangana Rising Global Summit: హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్యూచర్ సిటీలో పండగ వాతావరణం కనిపించేలా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం, మంగళవారాల్లో 100 ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వందల ప్రముఖులు హాజరుకానున్నారు. 6 ఖండాలలోని 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు తరలివస్తున్నారు. ఇందులో భాగంగా లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు.
గవర్నర్ ప్రారంభోత్సవం, సీఎం ప్రసంగం
నేటి (డిసెంబర్ 8న) మధ్యాహ్నం 1:00 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ లాంఛనంగా గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. సుమారు 2 వేల మంది దేశ, విదేశీ అతిథులు ఈ ప్రారంభ వేడుకకు హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో రెండేళ్ల తమ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) ప్రత్యేకతల గురించి సదస్సుకు హాజరైన అతిథులకు వివరిస్తారు.
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం ఈ సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు పలు అంశాలపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు ఒకేసారి 4 మీటింగ్ హాల్స్‌లో వేర్వేరు అంశాలపై చర్చాగోష్ఠులు జరుగుతాయి. మొదటి రోజు సోమవారం నాడు సదస్సులో ప్రగతి, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, యువత, నైపుణ్యాలు, మహిళాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలపై నిపుణులు చర్చిస్తారు.
రెండో రోజు కార్యక్రమాలు
డిసెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు వివిధ అంశాలపై పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులతో చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. రెండోరోజు సదస్సులో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో తెలంగాణతో భాగస్వామ్యంపై చర్చిస్తారు. అలాగే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవృద్ధికి తెలంగాణ ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ వంటి అంశాలపై చర్చిస్తారు. రెండ్రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు నిర్వహించనుండగా, ఇందుకు అనుగుణంగా సెమినార్ హాళ్లను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు.
సాంస్కృతిక శోభ, టూరిజం ప్రచారం
ఈ రెండ్రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం మ్యూజిక్ ఈవెంట్ నిర్వహిస్తోంది. దీంతో పాటు, తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, ఒగ్గు డోలు, పేరిణీనాట్యం, కోలాటం, గుస్సాడీ, బోనాల ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు, నాగార్జునసాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు ‘బుద్ధవనం’ పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నెలరోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో పలుమార్లు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షిస్తూనే ఉన్నారు.






















