Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
AP High Court: పరకామణి చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. అలాగే సమాచారన్ని ఐటీ, ఈడీకి కూడా ఇవ్వాలని సూచించింది.

FIR in Parakamani theft case: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి హుండీ చోరీకి పాల్పడిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చోరీ కేసును గతంలో లోక్ అదాలత్ లో రాజీ చేశారు. ఈ రాజీ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. సీఐడీ, ఏసీబీ తమ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 16కు వాయిదా పడింది.
సీఐడీ రెండు సీక్రెట్ నివేదికలను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించింది. తాజా విచారణలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. రవికుమార్ అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరుపుతుంది. అక్రమంగా రాజీ చేయడం వంటి అంశాలపై సీఐడీ విచారణ కొనసాగించాలని ఆదేశించింది. అలాగే ఫిర్యాదుదారు అయిన సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి వివరాలు, పోస్టుమార్టం రిపోర్టును కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సీఐడీ, ఏసీబీ తమ దర్యాప్తులో వెల్లడయిన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కు కూడా అందించాలని అదేశించింది.అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయంలో రంగంలోకి దిగితే.పరామకణి కేసు విషయంలో తెర వెనుక ఉన్న వారి వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ప్రధాన నిందితుడు రవికుమార్ ఆస్తులపై జరుగుతున్న దర్యాప్తును కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని హైకోర్టు డైరెక్ట్ చేసింది. సీఐడీ , ఏసీబీ డీజీలు కేసు సంబంధిత సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని, దర్యాప్తు ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించింది. తిరుమలలో మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సూపరింటెండెంట్ ఆఫీసర్ (ఏవీఎస్‌వో) సతీష్ మరణానికి సంబంధించిన శవపరీక్ష నివేదికను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందించాలని సీఐడీకి ఆదేశించింది. ఈ నివేదిక దర్యాప్తులో కీలకమైనదని, రహస్యంగా ఉంచాలని హైకోర్టు పేర్కొంది. కేసు దర్యాప్తులో భాగంగా ఇన్‌కమ్ ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి కేంద్ర ఏజెన్సీలతో సమాచారం పంచుకోవాలని, అవసరమైతే వాటి సహకారాన్ని పొందాలని ఆదేశాలు జారీ చేసింది.
పరాకామణిలో శ్రీవారికి భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీని దొంగతనం చేస్తూ పెదజీయరం మఠం క్లర్క్ రవికుమార్ పట్టుబడ్డారు. అప్పట్లో కేసు పెట్టిన విజిలెన్స్ అధికారులు తర్వాత ఆయనతో రాజీకి వచ్చారు. ఆయన ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారని కేసు రాజీ చేసుకున్నారు. కానీ ఆయనను పట్టుకుని చాలా మది ఆయన ఇతర ఆస్తులను కొట్టేశారని.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కేసు రాజీ కావడంతో మళ్లీ ప్రారంభించాడానికి అవకాశం లేదు. అయితే హైకోర్టు ఇలాంటి దొంగనం కేసుల్ని రాజీ చేయడమేమిటని ఆశ్చర్యపోయి మళ్లీ దర్యాప్తుకు ఆదేశించింది. సీక్రెట్ రిపోర్టును చూసి... ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.





















