TTD Silk Scam: పట్టు పేరుతొ పాలిస్టర్ సరఫరా - 11 ఏళ్లుగా టీటీడీని మోసం చేస్తున్న కాంట్రాక్టర్
TTD Contractor: భక్తులకు టీటీడీ ఇచ్చే పట్టు వస్త్రాలు నిజంగా పట్టువి కాదని పాలిస్టర్ అని తేలింది. కాంట్రాక్టర్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Contractor frauding TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి భారీ మోసం వెలుగులోకి వచ్చింది. భక్తులకు, దాతలకు అందించే పట్టు శాలువాలు పేరుతో 100 శాతం పాలిస్టర్ శాలువాలు సరఫరా చేసినట్లు తేలింది. 2015 నుంచి 2025 వరకు ఈ మోసం జరిగిందని..దాదాపు రూ.54.95 కోట్ల విలువైన శాలువాలు ఇలా కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. సెంట్రల్ సిల్క్ బోర్డు నాణ్యతా పరీక్షల్లో పాలిస్టర్ అని వెల్లడైంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ యాంటీ-కరప్షన్ బ్యూరో విచారణకు టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. ఇప్పటికే ఉన్న టెండర్లను రద్దు చేసి, కొత్త టెండర్లు జారీ చేస్తున్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టారు. 21,600 శాలువాల కొనుగోలు ప్రతిపాదనను పరిశీలిస్తున్నప్పుడు ఈ మోసం బయటపడింది. టెండర్ నిబంధనల ప్రకారం, శాలువాలు 100 శాతం మల్బర్రీ సిల్క్‌తో తయారు చేయబడాలి. వార్ప్, వెఫ్ట్‌లో 20/22 డెనియర్ సిల్క్ యార్న్ ఉపయోగించాలి. కనీసం 31.5 డెనియర్ కౌంట్, 100 ఎండ్స్ ప్రతి ఇంచ్, 80 పిక్స్ ప్రతి ఇంచ్, 1 మీటర్ వెడల్పు, 2.3 మీటర్ల పొడవు, 2.5 ఇంచ్ డబుల్ సైడ్ బోర్డర్ ఉండాలి. మధ్యలో ఓం నమో వెంకటేశాయ అనే పదం తెలుగు, సంస్కృతంలో ఉండాలి. అలాగే శంఖు, చక్ర, నామం చిహ్నాలు ఉండాలి. మొత్తం బరువు 180 గ్రాములు.. సిల్క్ మార్క్ హోలోగ్రామ్ లేబుల్ తప్పనిసరి.
విజిలెన్స్ టీమ్ తిరుపతి గోడౌన్‌లోని కొత్త స్టాక్, తిరుమల వైభవోత్సవ మండపంలోని ఆమోదిత స్టాక్ నుంచి నమూనాలు సేకరించింది. ఇవన్నీ నగరికు చెందిన సంస్థ సరఫరా చేసినవి. ఈ నమూనాలను బెంగళూరు, ధర్మావరం సెంట్రల్ సిల్క్ బోర్డు ల్యాబ్‌లకు పంపారు. రెండు ల్యాబ్‌లు కూడా పాలిస్టర్ అని నిర్ధారించాయి. తప్పనిసరి సిల్క్ హోలోగ్రామ్ లేదని కూడా తెలిసింది. గతంలో వేర్ హౌస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంపిన నమూనాలు కాంచీపురం సిల్క్ బోర్డు ల్యాబ్‌లో ఆమోదించారు. కానీ ఇటీవలి పరీక్షల్లో పాలిస్టర్ తేలడంతో, నమూనాల మార్పు లేదా ల్యాబ్ మానిప్యులేషన్ అనే అనుమానం వ్యక్తమవుతోంది.
వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్ ,దాని అనుబంధ కంపెనీలు 2015-2025 మధ్య టీటీడీకి రూ.54.95 కోట్ల విలువైన దుస్తులు సరఫరా చేశాయి. ఇటీవల 15,000 శాలువాలు ఒక్కో దానికి రూ.1,389 చొప్పున కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు, ఇవి కూడా పాలిస్టర్ అనే అనుమానం. ఈ మోసం వల్ల టీటీడీకి కోట్లాది నష్టం వాటిల్లిందని విజిలెన్స్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో విజిలెన్స్ రిపోర్ట్‌ను పరిశీలించారు. సరఫరాదారు మెటీరియల్ సప్లై చేసి మోసం చేశాడని నిర్ధారించారు. దీంతో, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు వివరణాత్మక విచారణకు లేఖ రాయాలని, అందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఇప్పటికే ఉన్న టెండర్లు రద్దు చేసి, కొత్త టెండర్లు జారీ చేయనున్నారు.





















