AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
Andhra economic situation : కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రా ఆర్థిక పరిస్థితి దారిన పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. 025-26 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికం గణాంకాలను విడుదల చేశారు.

CM Chandrababu On Andhra economic situation : 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి నమోదైన గణాంకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. స్థిర ధరల వద్ద నమోదైన ఆర్ధిక వృద్ధి, రాష్ట్రస్థూల ఉత్పత్తి, గ్రాస్ వాల్యూ అడిషన్, వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలు నమోదు చేసిన వృద్ధి గణాంకాలను వెల్లడించారు. విభజన వల్ల రాష్ట్రానికి వ్యవస్థీకృతమైన నష్టం జరిగిందని.అయితే 2019-24 పాలన వల్ల వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయింది
గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేట్ తగ్గి రూ. 7 లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయామన్నారు. గ్రోత్ రేట్ లేకపోవటం వల్ల రూ. 76,195 కోట్ల ఆదాయం కోల్పోయామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోంది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రాండ్ తగ్గినప్పుడు వడ్డీ రేటు పెరిగిపోతుంది. తద్వారా రెవెన్యూ జీఎస్డీపీలో రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. 25 ఏళ్ల క్రితం చేసిన ఐటీ పాలసీ వల్ల తెలుగు వాళ్ల తలసరి అదాయం గరిష్టస్థాయిలో ఉందన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్నదే ఎప్పుడూ నా ఆలోచన అని చంద్రబాబు స్పష్టం చేశారు. విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని.. ప్రతీ త్రైమాసికం, ఆర్ధిక సంవత్సరంలో సాధిస్తు్న్న రాష్ట్రస్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నామని.. రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చూస్తున్నామన్నారు. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీస్థాయిలో ప్రజలు మద్దతు పలికారని.. ప్రజలు సుపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారన్నారు.
ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి గతంలో అప్పులు తెచ్చారు. మూలధన వ్యయం చేయకపోవటంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. కూటమి అధికారంలోకి వచ్చాకే వాటిని ముందుకు తీసుకువెళ్లగలిగాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూల ధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లాం, వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లామని.. డీఫంక్ట్ అయిన వివిధ కేంద్ర పథకాలను మళ్లీ పునరుద్ధరించామన్నారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను మళ్లీ రివైవ్ చేయగలిగామన్నారు. పీక్ లోడ్ సమయంలో బహిరంగ మార్కెట్ లో విద్యుత్ ను యూనిట్ కు రూ.15 చోప్పున కొనుగోలు చేసిన పరిస్థితి. గత ప్రభుత్వం పీపీఎలు రద్దు చేయడం వల్ల ఎలాంటి విద్యుత్ వాడుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింన్నారు.
కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారు. ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వ్యవస్థలను నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నామన్నారు ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం. క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయి. రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నాం ఎస్ఐపీబీల ద్వారా రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఆమోదం తెలియచేశాం. విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేశారు... ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. గత పాలకులు విద్య శాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టారు. పల్లెపండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోందని.. జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకూ అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు.





















