Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Abhinava Krishna Devaraya | ఆయన సేవలను, ధర్మ నిబద్ధతను గుర్తించి, పర్యాయ పుట్టిగె శ్రీకృష్ణ మఠం మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ పవన్ కల్యాణ్ కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదుని ప్రదానం చేశారు.

AP Deputy CM Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ సేవలను, ధర్మ నిబద్ధతను గుర్తించి, పర్యాయ పుట్టిగె శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఏపీ డిప్యూటీ సీఎంకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదుని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం, సనాతన ధర్మం, భగవద్గీత ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు.
సనాతన ధర్మం ఆధ్యాత్మిక శాస్త్రం: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని ఆదివారం సాయంత్రం దర్శించారు. కనక కిండి ద్వారా శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకున్న ఆయన, పర్యాయ పుట్టిగె శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం జరిగిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ‘అభినవ శ్రీకృష్ణదేవరాయ’ అనే బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు బి. ఆనంద్ సాయి కూడా పాల్గొన్నారు.

ధర్మ పరిరక్షణ, భవిష్యత్తు సవాళ్లు
సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, సనాతన ధర్మం ఎప్పటికీ మూఢనమ్మకానికి ప్రతీక కాదని, అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి అని స్పష్టం చేశారు. ఇతరులు మన ధర్మం మీద దాడులు చేస్తున్నారని అనడం కంటే ముందు, మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని, ఇతరులు మనపై దాడి చేయకుండా గళమెత్తాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతీ హిందువులో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. పుట్టిగె మఠం చేస్తోంది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదని, అది సంస్కృతిక, నాగరికత బాధ్యత అని ప్రశంసించారు. 'ధర్మో రక్షతి రక్షితః' – మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని ఆయన గుర్తు చేశారు.

భగవద్గీత - రాజ్యాంగ స్ఫూర్తి
భారత రాజ్యాంగం యొక్క లిఖిత ప్రతిలో ఆదేశిక సూత్రాలు ఉన్న పేజీపై శ్రీకృష్ణుడు అర్జునునికి గీతను ఉపదేశిస్తున్న దృశ్యాన్ని చిత్రించడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది కేవలం అలంకరణ కోసమో, యాదృచ్ఛికంగానో వేయలేదని, సామాజిక న్యాయం, బాధ్యత, సమానత్వం, సంక్షేమం, ధర్మపాలన – ఇవన్నీ రాజ్యాంగం తెలిపే విలువలు అని బోధించేందుకే గీతాసారం ఉపదేశించే చిత్రాన్ని అక్కడ ఉంచారని వివరించారు. ధర్మం నైతిక దిక్సూచి అయితే, రాజ్యాంగం న్యాయ దిక్సూచి అని, రెండింటి లక్ష్యం న్యాయం, శాంతి, కరుణతో కూడిన సమాజమే అని తెలిపారు.
కొన్నిసార్లు సనాతన ధర్మాన్ని తప్పుగా చూపి, అవమానిస్తున్న సమయంలో మౌనం సరైన మార్గం కాదన్నారు. ఈ ధర్మ వాతావరణంలో ఎన్నో దేశాల నుండి వచ్చిన ఆలోచనాపరులు, భక్తులు కలవడం "వసుధైక కుటుంబం" అనే భారత ఆత్మను ప్రతిబింబిస్తుందన్నారు.

నిష్కామ కర్మ, యువతకు సందేశం
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భగవద్గీత నాకు నిష్కామ కర్మ నేర్పింది అన్నారు. మంత్రిగా తన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తానని, ఓట్లు వస్తాయా రావా అనేది రెండో విషయం అన్నారు. సత్యం పక్షాన నిలబడాలి, ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా సరే అని గీత చెప్పిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కురుక్షేత్రంలో అర్జునుడి తరహాలో తనలోనూ అనేక సంశయాలు నెలకొన్నప్పుడు, భగవద్గీతను స్మరించుకుని, వ్యక్తిగత లాభం కంటే రాష్ట్ర ప్రయోజనం ప్రధానం అని భావించి 21 సీట్లకు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాను ఈ రోజు ఇక్కడికి ఉప ముఖ్యమంత్రిగా కాకుండా, ధర్మాన్వేషిగా ఈ సభకు వచ్చానని తెలిపారు.
భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదని, అది మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి అని తెలిపారు. యువత (జనరేషన్-జీ, మిలియనీయల్స్) భగవద్గీతను పెద్దవాళ్ళు చదివాక ఎర్రబట్టలో కట్టి, పూజగదిలో ఉంచే గ్రంథంగా కాకుండా, మనసు కుంగితే చక్కటి సలహా ఇచ్చే కౌన్సిలర్‌గా, అయోమయంలో ఉంటే మెంటార్‌గా చూడాలని సూచించారు. ప్రతి రోజు మనం విధి నిర్వహణలోనూ, నిత్య జీవనంలోనూ చిన్న కురుక్షేత్రాలను ఎదుర్కొంటామని, అలాంటప్పుడు భగవద్గీత నిర్దేశనం చేస్తుందని పేర్కొన్నారు.

ఉడుపి క్షేత్రం, ప్రధాని సేవలు
ఉడుపి క్షేత్రంలోనికి అడుగుపెట్టగానే ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని, ఇది ఆలయ పట్టణం మాత్రమే కాదని, భారతదేశానికి ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అని కొనియాడారు. పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దూరదృష్టి, తపస్సు, ధర్మభక్తికి నిదర్శనంగా ఒక కోటి మంది కలిసి భగవద్గీతను స్వహస్తాలతో రాయడం అనే చారిత్రాత్మక కార్యాన్ని సాధించారని ప్రశంసించారు. అలాగే, లక్ష కంఠ గీతా పారాయణం ద్వారా వెలువడిన శక్తి భారతదేశానికి రక్షణ కవచంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పుట్టిగె మఠాధిపతి, ఇతర మఠాధిపతులు ఇటీవల గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘భారత భాగ్య విధాత’ బిరుదు ప్రదానం చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది భారత సంస్కృతిని బలోపేతం చేయడంలో మోదీ చేస్తున్న దీర్ఘకాల సేవకు ఇచ్చిన గౌరవం అన్నారు.






















