Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Suspicious Death of an Elephant in Chittoor District: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో గజరాజు అనుమానాస్పద మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.

పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని గంగవరం మండలం కల్లుపల్లి అటవీ ప్రాంతం సమీపంలో ఒక ఏనుగు మృతి చెందింది. ఈశ్వరయ్య అనే వ్యక్తికి చెందిన పంట పొలాల్లో ఈ ఏనుగు విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ఈ ఏనుగు మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంట పొలాల్లోకి రాకుండా అడవి ఏనుగును ఎవరైనా కావాలనే కరెంటు పెట్టి చంపేశారా? లేక అడవి అంచున ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి షాక్‌తో మరణించిందా? స్పష్టత లేదు. లేదా ఏదైనా అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిందా అనే కోణంలోనూ అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతంలో ఏనుగులు మృత్యువాత పడ్డాయి. పోస్టుమార్టం నిర్వహించిన తరువాతే ఏనుగు మృతికి కారణాలు తెలియనున్నాయి.
కౌండిన్య అటవీ ప్రాంతం: ఈ ప్రాంతం ఏనుగుల సహజ నివాసానికి ప్రసిద్ధి. ఇక్కడ తరచూ ఏనుగులు ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వస్తుంటాయి. అయితే తమ పంటలను కాపాడుకోవడానికి రైతులు ఏర్పాటు చేసే విద్యుత్ కంచెలు ఏనుగుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇలా వన్యప్రాణులను చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act) ప్రకారం తీవ్రమైన నేరగా భావిస్తారు. అడవి ఏనుగుల వల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. కానీ ఇలా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షలు తప్పవు అని అధికారులు చెబుతున్నారు.


















