Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Kaleshwaram Medigadda barrage | పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తరువాత తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జలవనరులను సద్వినియోగం చేసుకోలేదని, పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై, బీఆర్ఎస్ పాలనపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
పెండింగ్ ప్రాజెక్టులపై నిలదీత
పదేళ్ల సుదీర్ఘ పాలనలో కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, దిండి వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు ఈ ప్రాజెక్టుల జాప్యంపై కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్నవన్నీ అవాస్తవాలని, సీఎంగా చేసిన వ్యక్తికి ఇలాంటి మాటలు తగవని హితవు పలికారు.
ఆర్థిక భారం, బీఆర్ఎస్ వైఫల్యాలు
నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. కానీ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో పూర్తి చేయలేకపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టినందుకు కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని, కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు తీరని అన్యాయం చేసింది BRS ప్రభుత్వమేనని మండిపడ్డారు.
కాళేశ్వరంలో కేసీఆర్ వైఫల్యం, కమీషన్ల ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు కుంగిపోవడానికి కేసీఆర్ నిర్ణయాలే కారణమని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణ తీరును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA)తో పాటు సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుబట్టారని ఆయన గుర్తు చేశారు. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని, కూలిపోయే ప్రాజెక్టులను కట్టిన కేసీఆర్ ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను కాపాడుకోవడంలో అత్యంత సమర్థంగా ముందుకు సాగుతోందని, రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తుందని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు..
కేంద్ర ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ను వెనక్కి పంపితే తెలంగాణ ప్రభుత్వం కనీసం నోరు విప్పడం లేదని, పోరాటం చేయలేదని కేసీఆర్ ఆరోపించారు. పైగా తమకు 45 టీఎంసీలు ఇప్పించాలని ఇరిగేషన్ మంత్రి కేంద్రానికి లేఖ రాయడం దారుణం అన్నారు. న్యాయంగా రావాల్సిన వాటాను దక్కించుకోలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం ఫార్మా సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ లేదు, తొక్కా లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిజినెస్ మీట్స్ పెట్టి, ఇన్వెస్టిమెంట్స్ వచ్చాయంటూ దొంగ లెక్కలు చూపి ప్రజలను తామెన్నడూ మోసం చేయలేదని కేసీఆర్ పేర్కొన్నారు.






















