Revanth Reddy challenges KCR: దమ్ముంటే అసెంబ్లీకి రా.. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చిద్దాం: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్
Telangana CM Revanth Reddy | కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని, ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశాడని.. జలాల అంశంపై చర్చించేందుకు దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తెలంగాణ ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వం అని, రెండేళ్లు గడువు ఇచ్చినా, ఏ అభివృద్ధి చేయలేదని, హామీలు నెరవేర్చలేదని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దెబ్బతీశారని, ఆయన చేసిన ద్రోహం ఏ ఇతర నాయకుడు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి 'చిట్ చాట్'లో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రాథమికంగా చంద్రబాబు శిష్యుడేనని, గతంలో పట్టిసీమ ప్రాజెక్టును అభినందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. "ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపు కర్రతో కొడతాను.. ఆయన విసనకర్రతో అంటే నేను నీటి తొట్టితో సమాధానం చెబుతాను" అంటూ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో హెచ్చరించారు.
కేసీఆర్ ఓ ఆర్థిక ఉగ్రవాది..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను ఒక "ఆర్థిక ఉగ్రవాది"గా అభివర్ణిస్తూ, 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసి రాష్ట్రానికి కేసీఆర్ మరణశాసనం రాశారని మండిపడ్డారు. 811 టీఎంసీలలో 512 టీఎంసీలను ఏపీకి కట్టబెట్టి, జలదోపిడీకి సహకరించారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం లిఫ్టులు కట్టారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను కూడా సరిగా సమర్పించలేదని పేర్కొన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీలో అధికారం కోసం పోరాటం
బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలపై కూడా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం కోసం పోరాటం జరుగుతోందని, కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు మధ్య గొడవల వల్లే కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం పదవి కోసం కేటీఆర్ ఇప్పటికే కొత్త బట్టలు కుట్టించుకున్నారని, మరోవైపు హరీష్ రావు రూ. 5,300 కోట్ల పార్టీ ఆస్తులను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండి అసెంబ్లీకి రావాలని తాను కోరుకుంటుంటే, ఆయన వారసులే ఆయన రాజకీయ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.
జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడం మానేసి, ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి ముఖాముఖి చర్చల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాలేశ్వరం అవినీతి, ఇతర పాలనాపరమైన విచారణలపై కూడా తాము చిత్తశుద్ధితో ఉన్నామని, దీనిపై కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల గురించి ప్రశ్నిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేటీఆర్ ఓ ఐరన్ లెగ్..
కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు తారాస్థాయికి చేరిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయాల నుండి తప్పుకున్నాక లేదా ఆయన లేని పక్షంలో తన దారి తాను చూసుకుంటానని హరీష్ రావు ఇప్పటికే చెప్పకనే చెప్పారని రేవంత్ పేర్కొన్నారు. పార్టీలో కేటీఆర్ నాయకత్వం విఫలమైందని, ఆయన ఒక 'ఐరన్ లెగ్' అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో పార్టీ పగ్గాలను హరీష్ రావుకు అప్పగించాలనే డిమాండ్ బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోందన్నారు. కేటీఆర్ తన తండ్రి కుర్చీని కోరుకుంటుంటే, హరీష్ రావు మాత్రం ఆయన రాజకీయ పతనాన్ని లేదా అంతాన్ని కోరుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.






















