Sircilla News: సొంతిల్లు లేక రాత్రంతా మృతదేహంతో అంబులెన్స్‌లోనే కుటుంబం.. వారి కన్నీళ్లకు స్పందించిన కలెక్టర్
Telangana News | సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కేంద్రంలో జరిగిన ఘటనపై కలెక్టర్ స్పందించారు. మృతుడు సంతోష్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించడంతో ఎమ్వార్వో వారికి ఇల్లు ఇప్పించారు.

Sircilla News | ముస్తాబాద్: సొంత ఇల్లు లేకపోవడంతో ఓ కుటుంబం మృతదేహంతో రాత్రంతా అంబులెన్స్‌లో గడపాల్సి వచ్చింది. సంతోష్ అనే చేనేత కార్మికుడు అనారోగ్యంతో చనిపోగా, హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లారు. కానీ మృతదేహాన్ని ఇంట్లో ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాత్రంతా అంబులెన్స్ లోనే ఉంచారు. ఆయన పిల్లలు కూడా అందులోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. గ్రామస్తులు సాయం చేయడంతో చేనేత కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన బిట్ల సంతోష్(48) చేనేత కార్మికుడు. సంతోష్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేటలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆసుపత్రిలోనే మృతిచెందాడు. కుటుంబసభ్యులు సంతోష్ మృతదేహాన్ని అంబులెన్స్ లో ముస్తాబాద్ తీసుకెళ్లారు. అటు అద్దె ఇంట్లో లోపలకి తీసుకెళ్లలేక, పాత ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. దాంతో చేసేదేమీ లేక రాత్రంతా సంతోష్ మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచారు. ఆయన భార్య శారధ, ఇద్దరు కుమార్తెలు సైతం రాత్రంగా అంబులెన్స్ లోనే ఉండాల్సి వచ్చింది. వీరి పరిస్థితి చూసి చలించిపోయిన గ్రామస్తులు ఉదయం అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేశారు.
ఆదుకోవాలంటూ కన్నీళ్లు..
తన పెద్దనాన్న కుమారుడు చేనేత కార్మికుడిగా చేసేవాడని.. అనారోగ్యంతో చనిపోయాడని సంతోష్ సోదరుడు చెప్పాడు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని బాధతో అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సొంత ఇళ్లు లేకపోవడంతో అంబులెన్స్ లోనే మృతదేహంతో కుటుంబం ఉండాల్సి వచ్చిందన్నాడు. అతడు చేసిన రిక్వెస్ట్ పై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జన్ కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
స్పందించిన కలెక్టర్..
చేనేత కార్మికుడు సంతోష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల కలెక్టర్ తో మాట్లాడారు. ఆ కుటంబ పరిస్థితిని తెలుసుకుని చలించిపోయిన కలెక్టర్.. మృతుడు సంతోష్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయించాలరి ఎమ్మార్వోను ఆదేశించారు. తహసీల్దార్ సురేష్ బాధితుడి కుటుంబానికి ఇల్లు కేటాయించారు. ఇందిరమ్మ కాలనీలో ఇంటి తాళాలు వారికి ఇచ్చి ఆదుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

