Crime News : 80కి పైగా కేసులు - గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని అరెస్ట్
Crime News : పోలీసులపై కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.

Crime News : 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్థుడు గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. అతన్ని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. కానీ అంతలోనే నిందితుడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నిందితుడిని చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిగా గుర్తించారు. అతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 80 కేసులు ఉండగా.. అందులో తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి.
హైదరాబాద్ లోని మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించి విచారణ చేపట్టిన అధికారులు.. ఘటనాస్థలిలో లభించిన వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఈ కేసులో అనుమానితుడు 2023 నుంచి పరారీలో ఉన్న ఓ కరడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ గా నిర్థారించారు. ప్రీ ప్లాన్డ్ దొంగతనాలకు పేరుగాంచిన ప్రభాకర్.. తనను ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఆ తర్వాత తాను దోచుకున్న విలాసవంతమైన జీవనశైలి కోసం ఉపయోగించేవాడని సమాచారం. నిందితుడి కదలికపై నిఘా ఉంచిన పోలీసులు.. ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు నిత్యం వస్తుంటాడని గుర్తించారు. ఐటీ కారిడార్ లోని పబ్ ల సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడి ఫొటోలిచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని సూచించారు.
అలా శనివారం సా.7.10 గంటల ప్రాంతంలో పబ్ లో ప్రభాకర్ ఉన్నట్టు నిర్థారించుకున్న పోలీసులు.. మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలోనే పోలీసులను గుర్తించిన ప్రభాకర్.. పారిపోయేందుకు ప్రయత్నించడంతో అధికారులు అతన్ని వెంబడించారు. ఈ క్రమంలోనే అతను పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ సమయంలోనే కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి ఎడమ తొడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. మరో ఇద్దరు పబ్ బౌన్సర్లకు కూడా గాయాలయ్యాయి. అయినప్పటికీ పోలీసులు ప్రభాకర్ ను చాకచక్యంగా లొంగదీసుకుని, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిపిన సోదాల్లో అతని వద్ద నుంచి 2 తుపాకులు, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుల్ ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, పోలీసుల అదుపులో ఉన్న ప్రభాకర్ ను అధికారులు విచారిస్తున్నారు. సీసీఎస్, ఎస్వోటీ క్రైమ్ బృందాలు అతని నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

