Telangana News: పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం - పరీక్షలు ముగిసే వరకూ ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Snacks To Tenth Students: తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు, మోడల్ స్కూళ్లల్లో టెన్త్ విద్యార్థులకు అల్పాహారాన్ని శనివారం నుంచి అందిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకూ అల్పాహారం అందించనున్నారు.

Telangana Government Snacks To Tenth Class Students In Government Schools: తెలంగాణలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లల్లో టెన్త్ విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) అబిడ్స్‌లోని ప్రభుత్వ అలియా మోడల్ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు టీచర్స్ స్నాక్స్ అందించారు. కాగా, పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దసరా తర్వాత చాలా చోట్ల ఈ క్లాసెస్ మొదలయ్యాయి.
విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం తింటే.. ప్రత్యేక తరగతులు పూర్తై తిరిగి ఇంటికి వెళ్లే సరికి ఆలస్యమవుతోంది. ఇతర గ్రామాల విద్యార్థులకు దాదాపు సాయంత్రం 7 గంటలవుతోంది. అప్పటివరకూ వారు ఏమీ తినకపోవడంతో ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఉదయం, సాయంత్రం అల్పాహారం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈసారి మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకూ పాఠశాలలు నడిచే 38 రోజుల పాటు అల్పాహారం అందించనున్నారు.
ఏం ఇస్తారంటే..?
రాష్ట్రంలోని దాదాపు 4,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 194 మోడల్ స్కూళ్లల్లో సుమారు 1.90 లక్షల మంది టెన్త్ విద్యార్థులు చదువుతున్నారు. స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున మంజూరు చేయనున్నారు. ఇందులో భాగంగా ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు - బెల్లం, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడి, ఉడకబెట్టిన శనగల్లో రోజుకో రకం స్నాక్ అందిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

