Telangana Congress Politics: పది మంది ఎమ్మెల్యేల సైలెంట్ తిరుగుబాటు - తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది ?
Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందన్నది ఆ పార్టీ ముఖ్య నేతలకు అర్థం కావడం లేదు. పది మంది ఎమ్మెల్యేలు కలిసి చర్చలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది.

What is happening in Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోంది..కానీ ఆ విషయాన్ని బయటకు రానివ్వడం లేదు. పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఓ గ్రూపుగా మారి తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారన్న ప్రచారం గుప్పుమంది. ఈ పది మంది మొదట షాద్ నగర్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో సమావేశమయ్యారని చెప్పుకున్నారు. తర్వాత ఓ స్టార్ హోటల్‌లలో చర్చలు జరిగాయని చెప్పుకున్నారు. కానీ ఎవరూ తాము సమావేశమయ్యాన్న విషయాన్ని ధృవీకరించలేదు. అలాగని ఖండించనూ లేదు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోందా అన్న చర్చ ప్రారంభయింది.
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అధికారులెవరూ లేకపోవడంతో పార్టీ వ్యవహారాలపై చర్చించుకున్నట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేల అసంతృప్తి.. వారు గ్రూపుగా సమావేశమయ్యారన్న వార్తల కారణంగానే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. వారు ఏ ఉద్దేశంతో ఇలా సమావేశమయ్యారో ఇంటలిజెన్స్ రిపోర్టులను కూడా సేకరించి సీఎం రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేల అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అలా సమావేశమైన వారిలో ఎక్కువ మంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఈ అంశంపై ఆ ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారని చెబుతున్నారు. ఇలాంటి సమావేశాల వల్ల తప్పుడు ప్రచారం జరుగుతుందని దీని వల్ల రాజకీయంగా ఇబ్బంది పడతారని ఆయన మందలించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పీసీసీ చీఫ్ లేదా సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించాలి కానీ ఇలా చేసి.. మీడియాకు లీకులు ఇవ్వడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. అయితే వారు తాము కేవలం మర్యాదపూర్వకంగానే సమావేశం అయ్యామని .. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్న మాటే కానీ తమకు పనులు, బిల్లులు రావడం లేదన్న అసంతృప్తిని తెలిపారని అంటున్నారు. ముఖ్యంగా కేబినెట్ లో బడా కాంట్రాక్టర్ గా ఉన్న మంత్రి అన్ని పనులను తీసుకుంటున్నారని.. తమకు పనులు ఇవ్వడం లేదని అదే సమయంలో తమకు రావాల్సిన బిల్లుల విషయంలో కూడా అంత పాజిటివ్ స్పందన లేదని అంటున్నారు.
ఆ మంత్రితో మాట్లాడదామని.. ముఖ్యమంత్రితో కూడా మీ సమస్యలపై చర్చిస్తామని మరోసారి ఇలాంటి ప్రచారం జరగకుండా చూసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెలక్యేలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్నారని ప్రచారం జరిగిన ఓ ఎమ్మెల్యే ఢిల్లీలో ఉన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానని.. ఇలా ఏ ఎమ్మెల్యే గ్రూపుతోనూ సమావేశం కాలేదని ఆయన ప్రకటించారు. మరో వైపు ఈ ఎమ్మెల్యేలు.. కేవలం తమను ఇబ్బంది పెడుతున్న ఓ మంత్రి టార్గెట్ గానే సమావేశమయ్యారని అంతకు మించి ఏమీ లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేనా.. అంతకు మించి ఇంకేమైనా ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఫిరాయింపులపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ? - తెలంగాణ అసెంబ్లీ సెక్రటరికి సుప్రీంకోర్టు ప్రశ్న




















