S. V. Ranga Rao Birthday: కనుబొమ్మలతోనే నవరసాలు పండించగల మహా నటుడు - విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు గురించి ఈ విషయాలు తెలుసా?
S. V. Ranga Rao Birthday: నేడు (జూలై 3) విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు జయంతి. ఈ నేపథ్యంలో ఆయన గురించిన సంగతులు మీకోసం...
S. V. Ranga Rao Birthday Special: భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే దిగ్గజ నటులలో ఎస్. వి. రంగారావు ఒకరు. వెండితెర మీద నవరసాలు అత్యద్భుతంగా పండించిన గొప్ప నటుడాయన. చార్లీ చాప్లిన్ లాంటి గ్రేట్ యాక్టర్ ప్రశంసలు అందుకొన్న మహోన్నత వ్యక్తి. జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు.. అన్ని రకాల సినిమాల్లో నటించారు. ఆయన నటించని జోనర్ లేదు, ఆయన పోషించని పాత్ర లేదు. మూడు దశాబ్దాల పాటు దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి, సినీ అభిమానులో హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమగా పేరు గాంచిన ఎస్వీఆర్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
⦿ ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై 3న ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నూజివీడులో కోటేశ్వరరావు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు నలుగురు అన్నదమ్ములు, ఎనిమిది మంది అక్కచెల్లెళ్లు. రంగారావు మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 12 ఏళ్ల వయస్సులోనే రంగస్థల నటనపై ఆసక్తిని కనబరిన ఆయన, చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో పాల్గొనేవారు.
⦿ చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు రంగారావు. అయితే నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన 'వరూధిని' అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. ఎస్.వి.ఆర్.రావ్(బి.ఎస్సీ) అనే స్క్రీన్ నేమ్ తో పరిచయమయ్యారు. ఎస్వీఆర్ బంధువైన బి.వి.రామానందం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడి పాత్ర పోషించారు. ఇందుకుగాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.
⦿ 'వరూధిని' ఫ్లాప్ అవ్వడంతో రంగారావుకు సినిమా అవకాశాలు రాలేదు. దీంతో మద్రాసు ప్రెసిడెన్సీని విడిచిపెట్టి జంషెడ్‌పూర్ వెళ్లి, అక్కడ టాటా స్టీల్ కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. రెండేళ్లపాటు జాబ్ చేసి, 1947 డిసెంబరు 27న తన మేనమామ బడేటి వెంకట్రామయ్య కూతురు లీలావతిని పెళ్ళి చేసుకున్నారు. మళ్ళీ సినిమా ఆఫర్ రావడంతో అక్కడి నుంచి వచ్చేసి నటనపైనే దృష్టి పెట్టారు.
⦿ ఎస్వీ రంగారావుకి ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించే ఛాన్స్ వచ్చింది. అయితే అదే సమయంలో ఆయన తండ్రి చనిపోవడంతో ఆ అవకాశం చేజారి పోయింది. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకొని మద్రాసు వెళ్లేసరికి, అప్పటికే ఆలస్యమైందని ఆ పాత్రను ఎ.వి.సుబ్బారావుకు ఇచ్చారు దర్శకుడు బి.ఎ.సుబ్బారావు. అయితే అంత దూరం నుంచి తనని నమ్ముకొని ఉద్యోగం వదిలేసి మరీ వచ్చాడని బాధపడి, ఆ సినిమాలో అంజలీదేవి తండ్రి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు.
⦿ 'మనదేశం', 'తిరుగుబాటు' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన తర్వాత, 'షావుకారు' చిత్రం (1950) ఎస్వీఆర్ కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1951లో 'పాతాళ భైరవి'లో ఆయన పోషించిన నేపాల మాంత్రికుడు పాత్ర కెరీర్ ను మలుపు తిప్పింది. రాజు-పేద, మాయాబజార్, నర్తనశాల, మిస్సమ్మ, భక్త ప్రహ్లాద, బందిపోటు దొంగలు, నమ్మిన బంటు, పండంటి కాపురం వంటి ఎన్నో చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనతో మన్ననలు పొందారు.
⦿ దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు రంగారావు. యముడు, దుర్యోధనుడు, రావణుడు, హిరణ్యకస్యపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, బాణాసురుడు, బలరాముడు, హరిశ్చంద్రుడు, తాండ్ర పాపారాయుడు.. ఇలా అనేక పౌరాణిక, జానపద పాత్రలను సమర్ధవంతంగా పోషించారు.
⦿ 'నర్తనశాల'లో రంగారావు నటనకు భారత రాష్ట్రపతి పురస్కారంతో పాటుగా ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా లభించింది. జకార్తా ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ నటుడు ఎస్వీఆర్.
⦿ ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్ 'బంగారు పాప' సినిమాలో ఎస్వీ రంగారావు నటనకు ఫిదా అయ్యారు. ఎస్వీఆర్ పొరపాటున మన దేశంలో పుట్టాడు కానీ, మరే దేశంలోనైనా పుట్టివుంటే ప్రపంచపు నటులలోనే మేటి అనిపించుకునేవాడని సీనియర్ నటుడు గుమ్మడి ఓ సందర్భంలో అన్నారు.
⦿ దక్షిణ భారత చలనచిత్రంలో స్టార్ స్టేటస్‌ను అనుభవించిన మొట్టమొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వీ రంగారావు. ఆయన డైరెక్టర్ గా 'బాంధవ్యాలు' లాంటి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.. నిర్మాతగా 'నాదీ ఆడజన్మే' వంటి చిత్రాలను నిర్మించారు.
⦿ సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎస్వీ రంగారావుని విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ వంటి బిరుదులతో గౌరవించుకుంటారు.
⦿ రంగారావు 56 ఏళ్ల వయసులో 1974 జూలై 18న మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం 'యశోదకృష్ణ'.
⦿ లెజెండరీ నటుడు ఎస్వీ రంగారావు ఇప్పటి వరకూ ఎలాంటి పద్మ అవార్డులు అందుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డును నెలకొల్పింది. సహాయ పాత్రల్లో ఉత్తమ నటన కనబరిచిన నటులకు ఎస్వీఆర్ అవార్డును ప్రధానం చేస్తారు.
Also Read: యాస్కిన్‌తో సేనాపతి పోరాటం - ‘భారతీయుడు 2’కు గండంగా మారిన ‘కల్కీ 2898 ఏడీ’, పాన్ ఇండియా హిట్ డౌటేనా?