AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Andhra Pradesh Jobs | మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

AP Mega DSC Notification | అమరావతి: నిరుద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీపై చంద్రబాబు (Chandrababu) కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. సమ్మర్ హాలిడేస్ పూర్తయి, స్కూల్స్ రీఓపెన్ అయ్యా సమయానికి టీచర్ల భర్తీ (Teacher Jobs) పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీపై అప్ డేట్ ఇచ్చారు. గత ప్రభుత్వంలా కాకుండా తాము సకాలంలో పోస్టులు భర్తీ చేసి అందరికీ న్యాయం చేస్తామన్నారు.
టీడీపీ హయాంలోనే భారీగా ఉద్యోగ నియామకాలు
‘టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపడతాం. మెగా డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలి. జూన్ లో పాఠశాలలు ప్రారంభించేలోగా టీచర్లకు పోస్టింగులు ఇస్తాం. లక్షా 50 వేలు ఉద్యోగాలు ఇచ్చాం. ప్రజలు కూడా మన ప్రభుత్వ సేవల్ని గుర్తుంచుకుంటున్నారు. టీచర్లకు ట్రైనింగ్ పూర్తిచేసి, జూన్ వరకల్లా పోస్టింగులు సైతం ఇవ్వాలని’ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఒకటో రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లు జరిగాయని.. తమ ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం పనిచేస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే సీఎం చంద్రబాబు మూడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లు పెట్టి, ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ప్రజల కోసం అందరం పని చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ఇటీవల అసెంబ్లీలో నారా లోకేష్ ప్రకటన
ఏపీలో త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. వైసిపి సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం మత్స్యలింగం, బి.విరూపాక్షి పంపిన ప్రశ్నకు శాసనసభలో లోకేష్ సమాధానమిచ్చారు.
అయిదేళ్ల హయాంలో గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ విమర్శించారు. గత 30 ఏళ్లలో టిడిపి ప్రభుత్వాల హయాంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 (లక్షా 80 వేల 2 వందల 72) టీచర్ పోస్టులను భర్తీచేశామని లెక్కలు విడుదల చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం 2014-19 కాలంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2014, 18, 19లలో 3 డిఎస్సీలు నిర్వహించి 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసిందని లోకేష్ స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

