Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Andhra Pradesh News | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చిక్కుల్లో ఇరుక్కున్నారు. క్వార్ట్జ్ తవ్వకాలలో అక్రమాలు జరిగాయన్న కేసులో పోలీసులు కాకాణిని ఏ4గా చేర్చారు.

అమరావతి : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరులో కేసు నమోదు అయింది. వైసీపీ హయాంలో రూ.కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ చేశారని ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో అక్రమ రవాణాతో పాటు నిబంధనలు ఉల్లంఘించి పేలుడు పదార్థాలు వినియోగించారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇదివరకే ఇద్దరిని అరెస్ట్ చేయగా, మొత్తం 10 మంది పేర్లను ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
రూ.250 కోట్ల దోపిడీపై ఫిర్యాదు
లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణలున్నాయి. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని ఫిర్యాదు వచ్చింది. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రి కాకాణి పేరును ఏ4గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాడు. క్వార్ట్‌జ్ అక్రమాల వ్యవహారంలో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై 120బీ, 129, 220, 447, 427, 379, 506తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన శ్యాంప్రసాద్ రెడ్డి ఏ1 కాగా, ఏ2, ఏ3లుగా పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఏ6, ఏ8గా ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరు పరిచగా.. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
వైసీపీ హయాంలోనే టీడీపీ నేత సోమిరెడ్డి కేంద్ర మైనింగ్ శాఖకు విచారణకు ఆదేశించాలని ఫిర్యాదు చేశారు. రూ.250 కోట్లకు పైగా క్వార్ట్జ్ దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. ఆపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో కేసులో పురోగతి కనిపిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన మైనింగ్ శాఖ అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏ4గా కాకాణి పేరు చేర్చారు. శ్యాంప్రసాద్‌రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం తెలిసిందే. తాజాగా మరో ఏడుగురిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు.






















