Flight Ticket Booking: ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్న వెంటనే ఇకపై ఈ మెసేజ్ కూడా వస్తుంది
Big News For Air Travelers: DGCA తాజా సూచనల ప్రకారం, ఇప్పుడు విమాన టికెట్ బుక్ చేసుకున్న వెంటనే ప్రయాణీకులకు మరొక SMS లేదా వాట్సాప్ సందేశం కూడా వస్తుంది. దీనిలో కీలక సమాచారం ఉంటుంది.

DGCA New Directions To Airlines On Flight Ticket Booking: విమాన ప్రయాణీకులకు ఉత్తమ సేవలు అందించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాతావరణ మార్పులు, సాంకేతిక సమస్యలు లేదా మానవ తప్పిదాల కారణంగా ఫ్లైట్ ప్యాసెంజర్లు అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఎప్పటికప్పుడు కొత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో,
'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' (DGCA), సోమవారం, అన్ని విమానయాన సంస్థలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. DGCA నూతన ఆదేశం ప్రకారం, ఇకపై ఎవరైనా విమాన టికెట్ బుక్ చేసుకుంటే, ప్రయాణీకుల హక్కులు & సౌకర్యాల గురించి పూర్తి సమాచారం SMS లేదా వాట్సాప్ సందేశం (WhatsApp message) ద్వారా సదరు ప్రయాణీకుడికి పంపాలి. బుకింగ్ కన్ఫర్మేషన్‌తో పాటే ఈ మెసేజ్ కూడా పంపాలి. విమాన టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రతిసారీ ప్రయాణీకులకు ఈ సందేశాలు అందుతాయి.
DGCA ఈ ఆదేశం ఎందుకు ఇచ్చింది?
DGCA ఆదేశాల ప్రకారం, ఒక వ్యక్తి టికెట్ బుక్ చేసుకున్న వెంటనే అన్ని విమానయాన సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్యాసింజర్ చార్టర్ ఆన్‌లైన్ లింక్‌ను SMS లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా అతనికి చేరేలా చూసుకోవాలి. ఈ లింక్‌లో ప్రయాణీకుల హక్కులు, నియమాలు, ఫిర్యాదు పరిష్కారానికి సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ప్రయాణీకుల హక్కులకు సంబంధించిన ఈ సమాచారాన్ని ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు టికెట్‌లో కూడా ప్రముఖంగా ప్రస్తావించాలని కూడా DGCA నిర్దేశించింది. విమాన ఆలస్యం లేదా రద్దు సమయాల్లో టిక్కెట్ డబ్బులు వాపసు (refund rules of flight ticket charges) పొందడానికి ఏం చేయాలి, సామగ్రి నియమాలు (Luggage rules at flight journey), ఇతర ముఖ్యమైన విషయాల గురించి విమాన ప్రయాణికులకు ఇది వివరణాత్మక సమాచారం అందిస్తుంది.
క్రికెటర్ డేవిడ్ వార్నర్, క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే సహా కొందరు ప్రముఖులు ఇటీవల విమానయాన సంస్థల సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలు కూడా విమానయాన సంస్థల సేవల్లో లోపాలు, సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదులు చేశారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలోపెట్టుకుని, విమానయాన సంస్థలు ప్రయాణీకుల హక్కులను కాలరాయకుండా DGCA ఈ కొత్త ఆదేశాలు ఇచ్చింది.
ప్రయాణీకులకు ప్రయోజనం
DGCA నూతన నిర్ణయం ప్రయాణీకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే.. విమానం ఆలస్యం కావడం లేదా పూర్తి రద్దు కావడం, ప్రయాణీకుల లగేజీ పోవడం లేదా దెబ్బతినడం, బోర్డింగ్ తిరస్కరణ వంటి అనేక సమస్యలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి చాలా సందర్భాల్లో ఏం చేయాలో, తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో ప్రయాణీకులకు తెలియదు. ఇప్పుడు, DGCA నిర్ణయం తర్వాత, ఎలాంటి పరిస్థితిలో ఎలా స్పందించాలో ప్రయాణీకులకు తెలుస్తుంది. దీంతో, తమ ఫిర్యాదులు లేదా ఇబ్బందులను పరిష్కరించుకోగలుగుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

