Gajwel Politics: కేసీఆర్‌పై అనర్హతా వేటు వేయాలని గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర - చిల్లర రాజకీయం అని హరీష్ ఆగ్రహం
Telangana: కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసనలు చేపడుతున్నారు. తాజాగా వారు అసెంబ్లీకి హాజరుకాని సిఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని హైదరాబాద్‌కు పాదయాత్ర చేశారు.

KCR: కేసీఆర్‌పై ముప్పేట దాడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గజ్వేల్ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఆయన అసలు కనిపించడం లేదని గజ్వేల్ ను గాలికొదిలేశారని అంటున్నారు. పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్ ను కోరారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరిగింది. అలాగే
రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం అందించాలని నిర్ణయించారు.
అయితే కాంగ్రెస్ నేతల తీరుపై హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గజ్వేల్ ను తెలంగాణలో ఇతర పట్టణాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారని.. ఇవాళ గజ్వేల్ ను సకల సౌకర్యాలతో అలరారే ఒక ఆదర్శ పట్టణంగా ఉందన్నారు. ఒకప్పుడు గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, భౌతిక దాడులు, పోలీస్ కేసులు ఇప్పుడు గజ్వేల్ ను ప్రేమ, అభిమానాలకు, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారన్నారు. దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్ కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దేన్నారు.
గజ్వేల్ లో తాగు, సాగునీటి కొరతను కేసీఆర్ తీర్చారన్నారు. ఎకరం 4-5 లక్షల్లేని భూముల ధరలు 1 కోటి నుంచి 4 కోట్ల వరకు పెరిగాయి. ఇవాళ రేవంత్ రెడ్డి దరిద్రపు పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైపోతున్నది, భూముల ధరలు పడిపోతున్నయన్నారు. ఎవరికన్నా ఆపద ఉండి అమ్ముకుందామంటే, కొనే దిక్కు లేకుండా అయిపోయిందన్నారు. కేసీఆర్ రాకముందు గజ్వేల్లో పాఠశాలలు పాత బూత్ బంగ్లాల వలె ఉండేవి. ఇప్పుడు బ్రహ్మండమైన ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్నారు. యూనివర్సిటీలతో, కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడేలా ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టి కల్చర్ యూనివర్సిటీ, గురుకుల పాఠశాలలతో సరస్వతీ నిలయంగా తీర్చిదిద్దారని.. ఎక్కడ గోదావరి - ఎక్కడ పాండవుల చెరువని ప్రశ్నించారు. ఆనాడు విడాకుల పంచాయతీలకు కేరాఫ్ అడ్రస్ ఉండేది ఈ చెరువు .. ఇవాళ పసిపిల్లలు సాయంత్రంపూట కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నరని గుర్తు చేశారు.
గజ్వేల్ కు - కేసీఆర్ కు మధ్య ఉండేది తల్లీ బిడ్డల అనుబంధమని హరీష్ స్పష్టం చేశారు. రేవంత్ పాలనలో గజ్వేల్ కు 1 రూపాయి పని అయినా చేస్తే చెప్పాలన్నారు. కేసీఆర్ మంజూరు చేస్తే, టెండర్లు అయి, నడుస్తున్న 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారని ఆరోపించారు. గజ్వేల్ అభివృద్ధి మీద ఏడ్చినవు, కుళ్లినవు, ఇవాళ సీఎం అయినంక కూడా అదే ఏడుపా అని ప్రశ్నించారు. గజ్వేల్ మీద కేసీఆర్ గారిది కన్నతండ్రి ప్రేమ - రేవంత్ ది సవతి తల్లి ప్రేమ అని.. నిజం కాకపోతే ఆపేసిన పనులను ప్రారంభించాలన్నారు. కేసీఆర్ గజ్వేల్ లో కూడా పర్యటించకపోవడంతో ఈ రాజకీయం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

