TTD Board Decisions : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
Tirumala News: తిరుమలలో ఉద్యోగం చేస్తున్న శాశ్వత ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించనుంది.

Tirumala Tirupati Devasthanam Board Decisions : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి ఇవాళ(సోమవారం, 24-03-2025) సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల దేవస్థాన ఆస్తులు, ఉద్యోగులు చాలాపై ఈ నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. తిరుమలలో ఉద్యోగాలు చేస్తున్న శాశ్వత ఉద్యోగులకు ఇప్పటి వరకు ఏడాదికి ఒకసారి మాత్రమే దేవుని దర్శన భాగ్యం కలిగేది. ఇప్పుడు దాన్ని ప్రతి మూడు నెలలకోసారి మార్చారు. సుపథం దర్శన స్కీమ్ కింద తిరుమలలో శాశ్వత ఉద్యోగం చేసే వారు మూడు నెలలకోసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఒక్కో ఉద్యోగికి ఆరు టికెట్లు ఇస్తారు.
తిరుమలలో దుకాణాలు నిర్వహించే వాళ్లకు కచ్చితంగా లైసెన్స్ ఉండాలని తెలిపారు. అలా లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయిస్తామన్నారు. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటమని టీటీడీ ఛైర్మన్, ఈవో స్పష్టం చేశారు. 2025-26 సవంత్సరానికి రూపొందించిన రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ పాలకమండలి ఆమోదించింది.
విదేశాల్లో ఉన్న భక్తులు, అక్కడి ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇతర దేశాల్లో ఆలయాల నిర్మాణానికి కూడా టీటీడీ ఓకే చెప్పింది. దీని కోసం ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేయలని నిర్ణయించింది. దేశ, విదేశాల్లో కూడా టీటీడీకి భారీగా ఆస్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కొని కోర్టుల్లో మూలుగుతున్నాయి. వీటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. తిరుమలలో ఉన్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపునకు ఓకే చెప్పింది.
మొన్నీ మధ్య చంద్రబాబు నాయుడు చెప్పినట్టు దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మించనుంది. దీని ఏడాది కాలంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని తీర్మానించింది. శ్రీనివాస సేవా సమితి పేరుతో స్వామి వారికి కైంకర్యాల సామగ్రి సరఫరాలో అక్రమాలు జరిగాయని గుర్తించింది టీటీడీ. ఈ అక్రమాలపై కూడా విచారణకు ఆదేశించింది.
పోటు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయంతో పాటు జీతం పెంపుపై అంశం పరిశీలనలో ఉన్నట్టు ఛైర్మన్ వెల్లడించారు. గ్రామాల్లో అర్ధాంతరంగా ఆగిన ఆలయాల నిర్మాణాలకు టీటీడీ ఆర్థిక సాయం చేయనుంది. కొడంగల్, కరీంనగర్, ఉపమాక, అనకాపల్లె, కర్నూలు, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునః నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. వీటితోపాటు తితిదే మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు కూడా టీటీడీ ఓకే చెప్పింది.
శ్రీవారి అన్నప్రసాదాలకు ఆర్గానిక్ ఉత్పత్తులకు డొనేట్ చేసే దాతల పాసు బుక్కులు రద్దు చేశారు. తిరుమలలోని వీఐపీ, నాన్ వీఐపీ అతిథి గృహాల్లో కొన్నింటి పునః నిర్మాణం ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలిపిరి వద్ద సైన్స్ సిటీ, మ్యూజియం ఏర్పాటుకు కేటాయించిన 20 ఎకరాలు రద్దు చేశారు.
వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించనున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం 5.30 గంటలకు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్చే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. గతంలో ఇలాంటి దర్శనం ఉండేది. తర్వాత తీసేశారు. టిటిడి కళాశాలలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
పాత ఆగమ సలహామండలిని రద్దు చేసిన టీటీడీ కొత్త మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు రూ.కోటి మంజూరుకు చేశారు. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.





















