Sunita Williams Return to Earth | భగవద్గీత గణేశుడి విగ్రహం..సునీతా విలియమ్స్ ధైర్యం వెనుక కొండంత అండ
ఎంత నాసా సైంటిస్టులైనా దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన అనేవి ఉంటాయి కదా. మతం ఏదైనా కానీ అంతరిక్షంలో అన్ని నెలల పాటు అందరికీ దూరంగా బతకాల్సి వచ్చినప్పుడు మనసులో ఆ ఆందోళన మరింతగా ఉంటుంది. చాలా గుండె ధైర్యం ఉండాలి మన చుట్టు నలుగురైదుగురు మనుషులతోనే అన్ని నెలల పాటు బతకాలి అంటే. పైగా భారతీయ మూలాలతో హిందూ సంప్రదాయంలో పుట్టి పెరిగిన సునీతా విలియమ్స్ కు భక్తి మరింత ఎక్కువ. ఆమె ఇప్పటికి రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చినా..మూడోసారి 9నెలలు పాటు అంతరిక్ష అంధకారంలో చికుక్కుపోయిన ఆమెకు ధైర్యం ఇచ్చేవి మనోబలాన్ని చేకూర్చేవి ఏంటో గతంలో ఓ కార్యక్రమంలో స్వయంగా సునీతానే షేర్ చేసుకున్నారు.
2006 లో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసిన సునీతా విలియమ్స్… ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లి 195రోజులు ఉండి వచ్చారు. మొదటిసారి వెళ్లినప్పుడు తనతో తను ఎంత గౌరవంగా పూజించే రోజూ చదువుకునే భగవద్గీత పుస్తకాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు సునీతా విలియమ్స్. ధైర్యం సరిపోనప్పుడు ఏదైనా లో ఫీల్ అవుతున్నప్పుడు శ్రీకృష్ణపరమాత్ముడు బోధించిన విషయాలను చదువుకుని బోలెడంత ధైర్యాన్ని పోగు చేసుకునేవారట సునీతా విలియమ్స్. ఇక రెండోసారి అంటే 2012 లో ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీత..మళ్లోసారి 127 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. అప్పుడు తనతో పాటు ఉపనిషత్తులను, ఓం ఆకారాన్ని తీసుకుని వెళ్లారట సునీత. ఈ విషయాన్ని ఆమెనే భారత్ కు వచ్చినప్పుడు బొంబాయి ఐఐటీలో విద్యార్థులతో మాట్లాడుతూ చెప్పారు. అంతే కాదు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపటానికి నాసా అధికారిక యూనిఫామ్ ను ధరించే కార్యక్రమానికి వచ్చారు సునీతా విలియమ్స్. ఇక ఈసారి ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు తనతో పాటు చిన్నపాటి వినాయకుడి ప్రతిమను తీసుకుని వెళ్లారు సునీత. విఘ్నాలను తొలగించటంతో పాటు గణేశుడు తన లక్కీ ఛార్మ్ అంటారు సునీతా విలియమ్స్. ఈసారి ఏకంగా తొమ్మిది నెలల పాటు చిక్కుకుపోవాల్సి వచ్చినా..అంతరిక్షంలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయినా వినాయకుడిని మొక్కుకుని ధైర్యం తెచ్చుకున్నారు సునీతా విలియమ్స్. అందుకే 322రోజుల పాటు ధైర్యంగా స్పేస్ లో ఉండగలిగారు. తనకున్న దైవభక్తితో, ఆధ్యాత్మిక చింతనతో ధైర్యాన్ని కూడగట్టుకుని తన జీవితంలో ఏకంగా 622 రోజుల పాటు ధీర వనితలా గడపగలిగారు సునీతా విలియమ్స్.





















