Hyderabad MMTS Incident: ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం.. పోలీసుల అదుపులో పాత నేరస్తుడు
Hyderabad Crime News | అత్యాచారయత్నం చేయడంతో కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి కిందకి దూకిన యువతి కేసులో పురోగతి కనిపిస్తోంది. ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Hyderabad MMTS Woman Incident | హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడిగా భావించి ఓ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గంజాయికి బానిసైన పాత నేరస్తుడు అని సమాచారం. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడి ఫొటోను బాధితురాలకి చూపించగా.. యువతి సరిగ్గా గుర్తించలేకపోతోంది. ఆ సమయంలో షాక్ లో ఉన్న బాధితురాలు నిందితుడి ముఖాన్ని అంతగా గుర్తుపెట్టుకోలేదు. తనను కాపాడుకోవడమే ఆమె మైండ్ లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
గంజాయికి బానిసైన యువకుడిపై పోలీసుల అనుమానం
మేడ్చల్ జిల్లాకు చెందిన జంగం మహేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంఎంటీఎస్ ఘటనపై ప్రశ్నిస్తున్నారు. కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లోంచి యువతి కిందకి దూకాల్సిన పరిస్థితి, ఆమెపై దాష్టీకానికి పాల్పడ్డాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితుడిగా భావిస్తున్న మహేశ్‌ను భార్య ఏడాది కిందట వదిలివేసింది. మరోవైపు తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో గంజాయికి బానిసైనట్లు పోలీసులు తెలిపారు. మహేశ్‌పై ఇంకా ఏమైనా కేసులు నమోదయ్యాయా, ఆ కేసుల్లో అప్‌డేట్ ఏంటనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
అసలేం జరిగిందంటే..
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తోంది. ఈ నెల 22న బాధిత యువతి తన ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ వెళ్లింది. పని పూర్తయ్యాక సికింద్రాబాద్ లో తిరిగి తెల్లాపూర్- మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. మహిళా కంపార్ట్‌మెంట్లోనే ఆమె ప్రయాణించింది. అల్వాల్ స్టేషన్ కు చేరుకున్నాక ఎంఎంటీఎస్ రైలు చేరుకోగానే.. కంపార్ట్ మెంట్లో ఉన్న ఇద్దరు మహిళలు దిగిపోయారు. కంపార్ట్ మెంట్లో యువతి ఒంటరిగా కనిపించడంతో అదే కంపార్ట్ మెంట్లో ఎక్కిన యువకుడు ఆమె వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
వేధింపులు భరించలేక కదుతున్న రైలు నుంచి దూకేసిన యువతి
తన కోరిక తీర్చాలంటూ ఆమె చేతి పట్టుకుని వికృత చేష్టలు మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తుంటే ఆందోళనకు గురైన యువతి కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి కిందకి దూకేసింది. కొంపల్లి సమీపంలో కిందకు దూకిన దూకిన బాధితురాలు గాయాలతో పడి ఉండటాన్ని గమనించి స్థానికులు 108 కు కాల్ చేశారు. పోలీసులు, సిబ్బంది వచ్చి ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీఆర్పీ ఎస్పీ చందన దీప్తి సోమవారం నాడు బాధితురాలని పరామర్శించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పినట్లు తెలిపారు.
పోలీసులు 4 బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్నారని ఎస్పీ చందన దీప్తి తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకూ అన్ని రైల్వేస్టేషన్లలో అన్ని సీసీ కెమెరాలను సేకరించిన పోలీసులు ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు మేడ్చల్ జిల్లాకు చెందిన మహేశ్ అనే పాత నేరస్తుడ్ని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పోలీసులు దర్యాప్తు వివరాలు, లేక నిందితుడి నిర్ధారణపై మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

