Aditya 369 Rerelease: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... ఉగాది రోజే 'ఆదిత్య 369' రీరీలీజ్ ఫంక్షన్
Nandamuri Balakrishna: బాలయ్య హీరోగా నటించిన 'ఆదిత్య 369' మూవీ రీరిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఉగాది పర్వదినాన 'ఆదిత్య 369' రీరీలీజ్ ఫంక్షన్ ను చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్.

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అందులో ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ సినిమాగా మంచి ప్రేక్షకాదరణ ఉన్న సినిమా 'ఆదిత్య 369'. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్న ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో కూడా మరిచిపోలేని మైలురాయి గా మారింది. తెలుగులో మాత్రమే కాదు ఇండియన్ సినీ హిస్టరీలో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా పేరు తెచ్చుకుంది. తాజాగా నిర్మాతలు ఈ మూవీ రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉగాది రోజున 'ఆదిత్య 369' మూవీ రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఉగాది రోజున 'ఆదిత్య 369' పండగ
1991లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'ఆదిత్య 369' మూవీ రీరిలీజ్ సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మార్చ్ 30న ఉగాది సందర్భంగా నందమూరి బాలకృష్ణతో సహా సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్లో భారీ రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థకి భారీ విజయాన్ని, చిరస్మరణీయ గుర్తింపును అందించిన 'ఆదిత్య 369' సినిమాను ఏప్రిల్ 4న రిలీజ్ చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సంతోషాన్ని పంచుకోవడానికి ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా సమక్షంలో మూవీ రీరిలీజ్ ఫంక్షన్ ను ఉగాది రోజున ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంతేకాకుండా ఈ మూవీ రిలీజ్ కు భారీ సంఖ్యలో థియేటర్లు దొరకడంతో ఘనంగా రిలీజ్ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఈ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ మూవీని 4k డిజిటలైజేషన్, 5.1తో ఏప్రిల్ 4న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు.
'ఆదిత్య 369' రీరిలీజ్ డేట్ ఛేంజ్
నందమూరి బాలకృష్ణ హీరోగా, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369'. ముందుగా ఈ మూవీని ఇప్పటి టెక్నికల్ హంగులతో తీర్చిదిద్ది, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించడానికి ఏప్రిల్ 11న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత పలు కారణాల వల్ల మూవీని ఏప్రిల్ 11న కాకుండా ముందుగానే రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 4వ తేదీన 'ఆదిత్య 369' మూవీని రీరిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు శివలెంక కృష్ణ ప్రసాద్. ఇప్పటికే వందలసార్లు టీవీలలో 'ఆదిత్య 369' మూవీని వీక్షించారు తెలుగు ప్రజలు. అయినప్పటికీ మరోసారి ఇప్పటి టెక్నాలజీతో 'ఆదిత్య 369' మూవీని బిగ్ స్క్రీన్ పై చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ మూవీ రిలీజ్ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో 'ఆదిత్య 369' మూవీ బిగ్ స్క్రీన్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

