100 Most Powerful Indians: దేశంలో అత్యంత శక్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
Most Powerful Indians List | దేశంలో 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. దక్షిణాది సీఎంలలో చంద్రబాబు ముందున్నారు.

100 Most Powerful Indians: ఢిల్లీ: 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చోటు దక్కించుకున్నారు. జాతీయ మీడియా సంస్థలలో ఒకటైన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం నాడు వంద మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెంబర్ వన్‌గా నిలిచారు. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలవగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టాప్ 10లో రాహుల్ గాంధీ చోటు దక్కించుకున్నారు. ఈ 100 మంది జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు వ్యక్తులు స్థానం దక్కించుకున్నారు.
టాప్ 15లో చంద్రబాబు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పవర్‌లిస్ట్ 2025లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ 15లో చోటు దక్కించుకున్నారు. 'IE 100' జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 14వ స్థానంలో నిలిచారు. దక్షిణాది నుంచి మెరుగైన ర్యాంక్ సాధించారు. గత ఏడాది 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించింది. ఆ చారిత్రక విజయం సాధించడంతో చంద్రబాబు దేశంలోని తొలి 15 మంది శక్తిమంతుల జాబితాలో అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సైతం చంద్రబాబు మద్దతు ఎంతో అవసరం. అటు ఏపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు, ఇటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో టీడీపీ అధినేతకు కీలక స్థానం వరించింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా నిలిచారు. దేశంలో 100 మంది శక్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024లో ఈ జాబితాలో 39 స్థానంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగబాకడం విశేషం. పాలనలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, ఇండియా (I.N.D.I.A) కూటమిలో కీలకపాత్ర పోషిస్తుండటంతో రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. ప్రాంతీయ నాయకుడినే కాకుండా దేశంలోనే పవర్ ఫుల్ లీడర్లలో ఒకరిగా నిలిచారు. మంత్రిగా చేసిన అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కీలకనేతగా మారిన రేవంత్ రెడ్డి, దేశంలోనే అత్యంత ప్రభావం చూపగల స్థాయికి చేరుకున్నారు.
ఈ పవర్ ఫుల్ పర్సన్ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు కంటే జాబితాలో ముందున్న ఇద్దరు సీఎంలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. దక్షిణ భారత సీఎంలలో చంద్రబాబు చాలా ముందున్నారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఈ ఆందోళనకు నాయకత్వం వహించే ప్రయత్నం మొదలుపెట్టిన డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 23వ స్థానంలో ఉన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ జాబితాలో 20వ స్థానం దక్కించుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి, కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా మారారు. హైదరాబాద్ ఎంపీ, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ జాబితాలో 89వ స్థానంలో నిలిచారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

