పుట్టినరోజు నాడే యువకుడి దారుణహత్య, కూతుర్ని ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికిన యువతి తండ్రి
Peddapalli Crime News | తన కూతురు జోలికి రావొద్దని, ప్రేమ లాంటివి వద్దని వారించినా పట్టించుకోని యువకుడు శవమయ్యాడు. పుట్టినరోజు నాడే యువతి తండ్రి గొడ్డలితో నరికి హత్య చేశాడు.

Honour Killing Case | ఎలిగేడు: పెద్దపల్లి జిల్లాలో జరిగిన పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తన కూతుర్ని ప్రేమిస్తున్న యువకుడ్ని అతడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా వెళ్లి గొడ్డలితో నరికి హత్య చేశాడు యువతి తండ్రి. చంపవద్దని వేడుకున్నా కనికరించకుండా గొడ్డలితో దాడి చేయడంతో యువకుడు మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ఉప్పెడు తోట గ్రామంలో ఈ ఘటన జరిగింది.
అసలు ఏం జరిగిందంటే..
ముప్పిరి తోట గ్రామానికి చెందిన సదయ్య కూతురు పెద్దపల్లిలో డిగ్రీ చదువుతోంది. ఆ యువతి స్కూల్ ఫ్రెండ్ పూరెళ్ళ సాయికుమార్ తో గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉంది. వీరి వ్యవహారం తెలియడంతో కులాలు వేరు అని యువతి తండ్రి మొదటి నుంచి కూతురి ప్రేమను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఊరికి దూరంగా ఉంచాలని భావించి, ఆమెను ప్రైవేట్ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తన పుట్టినరోజు కావడంతో పెద్దపల్లిలో తన ప్రియురాలిని కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు సాయికుమార్ వెళ్ళాడు. అదే గ్రామం కావడంతో విషయం తెలుసుకున్న సదయ్య ఈ విషయంపై ఆరా తీశాడు. పెద్దపల్లికి వెళ్లిన సదయ్య బంధువు ఇది నిజమేనని, సాయికుమార్ వచ్చి అమ్మాయిని కలిసి వెళ్ళాడని తెలిపాడు. దాంతో సదయ్య ఆవేశం కట్టలు తెంచుకుంది. తన కుమార్తె జోలికి రావద్దు అని హెచ్చరించినా పట్టించుకోవడంలేదని సాయికుమార్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
పెద్దపల్లి నుంచి గ్రామానికి తిరిగి వచ్చిన సాయికుమార్ రాత్రిపూట తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు పార్టీలో భాగంగా మద్యం సేవిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సదయ్య గొడ్డలి తీసుకుని సాయికుమార్ వద్దకు వెళ్లాడు. తనపై దాడి చేసేందుకు వచ్చాడని గమనించిన సాయికుమార్ పరుగులు పెట్టాడు. కానీ అతడి ప్రియురాలి తండ్రి సదయ్య వేటాడి వెంటాడి సాయికుమార్ ను పట్టుకున్నాడు. తనను చంపవద్దని, వదిలేయాలని వేడుకున్నా సదయ్య మనసు కరగలేదు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో సాయికుమార్ మెడపై నరికాడు. గొడ్డలితో విచక్షణారహితంగా చేసిన దాడిలో సాయికుమార్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం స్థానికులు నిందితుడు సాధన పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
సాయికుమార్ తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా, డెంగ్యూ సోకడంతో సోదరీ ఇప్పటికే మృతి చెందింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు సాయికుమార్ సైతం ఇలా దారుణ హత్యకు గురికావడంతో అతడి తల్లితండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతికి అంది వస్తాడు అనుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా తల్లిదండ్రుల రోదించారు. పరువు హత్య ఘటన తెలియడంతో పెద్దపల్లి డిసిపి కర్ణాకర్, ఏసీబీ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఉప్పిరి తోట గ్రామంలో పీకే ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకున్నారు.






















