TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
TDP Formation Day | తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సంబదర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

AP CM Chandrababu Wishes TDP Leaders Activists | తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీగా పేర్కొన్నారు. ‘అన్న’ నందమూరి తారకరామారావు (NTR) ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం (Telugu Desam Party) దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.
తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా..
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా. తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా. ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా... మన పసుపు జెండా! దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు.
పార్టీ సభ్యత్వాలతో రికార్డు
ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం. కోటికి పైగా సభ్యత్వాలతో రికార్డును సృష్టించి... తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తూ... చారిత్రాత్మక దినమైన నేడు... ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను. జై తెలుగుదేశం... జోహార్ ఎన్టీఆర్! #43YearsOfTDP #TDPFoundationDay అని ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం. ప్రగతి - ప్రజాసంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం. పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించారు. వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను… pic.twitter.com/z5H8wEWoKs
— Lokesh Nara (@naralokesh) March 29, 2025
టీడీపీ ఆవిర్భావమే ఒక సంచలనం..
తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం అని, ప్రగతి - ప్రజా సంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.. పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ నందమూరి తారకరామారావు (Sr NTR) రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించారని గుర్తు చేసుకున్నారు.. వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు.. నేడు స్వర్ణాంధ్ర సాకారానికి కృషిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు అందరికీ నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.






















