Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Telangana BJP: తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి కాక ప్రారంభమయింది. బండి సంజయ్ అనుచరుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ఈటల రాజేందర్ అసంతృప్తికి గురయ్యారు

Etala Rajender unhappy on bandi Sanjay PRO Post: తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ పోరాటం మరో మలుపు తిరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ తరపున అభ్యర్థులుగా ఖరారు చేసే వ్యవహారంలో ప్రారంభమైన వివాదాలు అంతకంతకూ పెద్దవి అవుతున్నాయి.
బండి సంజయ్ అనుచరులు ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులుగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా బరిలో నిలబెట్టారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌కు సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా ఉన్న నేత. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. దీంతో ఆయన నియోజకవర్గం మారిపోయినట్లయింది. కానీ హుజూరాబాద్ లో మాత్రం పట్టు తనదేనని అంటున్నారు. కానీ హూజురాబాద్ బీజేపీలో బండి సంజయ్ వర్గీయులు కూడా బలంగా మారారు. వారే ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు అయిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లుగా బరిలో ఉన్నారు.
అయితే తన అనుచరులకు అన్యాయం జరగకూడదని.. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నందున తన అనుచరుల్ని కూడా బరిలోకి దింపారు. ఈ పోటీలో సర్పంచులుగా బండి సంజయ్ మద్దతుదారులే ఎక్కువగా గెలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్ పీఆర్వోగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఈటల రాజేందర్ ను కించ పరుస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్ బీజేపీ తరపున కాదన్నట్లుగా ఆ పోస్టులు ఉండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఈటల రాజేందర్ ఈ అంశంపై స్పందించారు. తాను బిజెపి పార్టీ ఎంపీనని .. కూడా కొన్ని పోస్ట్ లను చూసాను.. అవగాహన లేని, పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి అన్నారు. అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారని మండిపడ్డారు. వీటి పైన పార్టీ తేల్చుకుంటది.. టైమ్ విల్ డిసైడ్ అని వ్యాఖ్యానించారు. ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుందని.. సందర్భం వచ్చినప్పుడు అన్ని చెప్తానన్నారు. రెండు, మూడోవ విడత ఎన్నికల అయ్యాక జరిగిన పరిణామాలన్నీ చెప్తానన్నారు. అంటే.. పంచాయతీ ఎన్నికలు అయిన తరవాత ఆయన బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది.
హుజూరాబాద్ లో తన క్యాడర్ కు అన్యాయం జరిగితే తాను ఊరుకునేది లేదని కొంత కాలంగా ఈటల రాజేందర్ బహిరంగంగానే చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో తన తరపున వారికి న్యాయం జరగడం లేదన్న భావనలో ఉన్న ఈటల.. ఎన్నికల తరవాత ఫైరయ్యే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.





















