NZ vs PAK Highlights: అయ్యయ్యో కివీస్! కాచుకో ఇండియా - ఫైనల్ చేరిన పాకిస్తాన్!
NZ vs PAK Highlights: సంచలనాల పాకిస్థాన్ మరోసారి అద్భుతం చేసింది! ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలోనే అత్యుత్తమంగా ఆడిన న్యూజిలాండ్‌ను ఓడించింది.
NZ vs PAK Semi-final Innings: సంచలనాల పాకిస్థాన్ మరోసారి అద్భుతం చేసింది! ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలోనే అత్యుత్తమంగా ఆడిన న్యూజిలాండ్‌ను వణికించింది. సిడ్నీలో జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లకే ఛేదించింది. ప్రత్యర్థికి ఏ వ్యూహాలు అమలు చేయాలో తెలియనంత వేగంగా పవర్‌ప్లే ఆడేసింది.
పాక్ ఓపెనర్లు బాబర్ ఆజామ్ (53; 42 బంతుల్లో 7x4), మహ్మద్ రిజ్వాన్ (57; 43 బంతుల్లో 7x4) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. అసలు సిసలు మ్యాచులో తిరుగులేని ఫామ్‌లో కనబరిచారు. కేన్ విలియమ్సన్‌కు వారినెలా అడ్డుకోవాలో అర్థమేకాలేదు. అంతకు ముందు కివీస్‌లో డరైల్ మిచెల్ (53*; 35 బంతుల్లో 3x4, 1x6), కేన్ విలియమ్సన్ (46; 42 బంతుల్లో 1x4, 1x6) రాణించారు. ఫైనల్లో ఇంగ్లాండ్, భారత్ మ్యాచులో విజేతతో పాక్ తలపడనుంది.
We are in the T20 World Cup final! 🤩#WeHaveWeWill | #T20WorldCup | #NZvPAK pic.twitter.com/UfRbbcEbjb
— Pakistan Cricket (@TheRealPCB) November 9, 2022
రిజ్వాన్, బాబర్ ఫైటింగ్
మందకొడి పిచ్.. నెమ్మది బంతులు ఆడలేని సిచ్యువేషన్.. కివీస్‌లో బలమైన బౌలింగ్ లైనప్! ఏమాత్రం అనుకూలంగా లేని కండీషన్స్! ఇవేమీ పట్టనట్టు ఆడేసింది పాకిస్థాన్. టోర్నీ సాంతం పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ ఆకలిగొన్న పులుల్లా చెలరేగారు. ఆరంభ ఓవర్ నుంచే బంతిని చితకబాదడం మొదలుపెట్టారు. కేన్ చేసిన ఓ తప్పిదాన్ని వీరిద్దరూ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. పేసర్ల బౌలింగ్‌ను టార్గెట్ చేసి మరీ కొట్టారు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికే పాక్ వికెట్ నష్టపోకుండా 55 రన్స్ చేసింది. అప్పటికే స్టాండైన ఓపెనర్లు స్పిన్నర్ల బౌలింగ్‌ను సునాయసంగా ఆడేశారు. ఆజామ్ 38 బంతుల్లో, రిజ్వాన్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీలు కొట్టడంతో 11.4 ఓవర్లకే పాక్ 110 రన్స్ చేసేసింది. జట్టు స్కోరు 105 వద్ద బాబర్‌ను, 132 వద్ద రిజ్వాన్‌ను బౌల్ట్ ఔట్ చేసినా వారికి ఇబ్బంది లేకుండా పోయింది. వన్‌డౌన్‌లో మహ్మద్ హ్యారిస్ (30; 26 బంతుల్లో 2x4, 1x6) సమయోచితంగా ఆడటంతో మరో 5 బంతులు మిగిలుండగానే పాక్ గెలిచేసింది.
సరిపోని స్కోర్
ఇప్పటికే ఉపయోగించిన పిచ్, మందకొడిగా ఉండటంతో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 4 పరుగుల వద్దే ఫిన్ అలెన్ (4) వికెట్ పోగొట్టుకుంది. పాక్ బౌలర్లు స్లో బంతులతో విరుచుకుపడటంతో డేవాన్ కాన్వే (21), కేన్ విలియమ్సన్ (46) ఆచితూచి ఆడారు. బంతికో పరుగు చొప్పున చేశారు. ఈ జోడీ 32 బంతుల్లో 34 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పింది. కీలక సమయంలో కాన్వే రనౌట్ కావడం, గ్లెన్ ఫిలిప్స్ (6) ఔటవ్వడంతో కివీస్ కష్టాల్లో పడింది. ఈ సిచ్యువేషన్‌లో కేన్ అండతో డరైల్ మిచెల్ ఎదురుదాడికి దిగాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూనే దొరికిన బంతిని బౌండరీకి పంపించాడు. దాంతో 14.3 ఓవర్లకు స్కోరు 100 చేరుకుంది. 50 బంతుల్లో 68 భాగస్వామ్యం అందించిన ఈ జోడీని కేన్‌ను ఔట్ చేయడం ద్వారా అఫ్రిది విడదీశాడు. అప్పడు స్కోరు 117. మిచెల్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. నీషమ్ (16)తో కలిసి బౌండరీలు బాదేదామన్నా పాక్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేయడంతో కివీస్ 152/4కు పరిమితమైంది.