TG SSC Exams: పదోతరగతి పరీక్షలు ప్రారంభం, 2650 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
SSC Exams: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4తో పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

TG SSC Exams: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం (మార్చి 21న) ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా.. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు.
తెలంగాణలో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద డీఈవో, తహసీల్దారు, ఎంఈవోల ఫోన్ నంబర్లు ఉంటాయని, ఏమైనా సమస్యలొస్తే వారి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 26న మ్యాథమెటిక్స్, మార్చి 28న ఫిజికల్ సైన్స్, మార్చి 29న బయలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 3న ఓరియంటెల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 4న ఓరియంటెల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..
➥ మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
➥ మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
➥ మార్చి 24న ఇంగ్లిష్
➥ మార్చి 26న మ్యాథమెటిక్స్
➥ మార్చి 28న ఫిజికల్ సైన్స్
➥ మార్చి 29న బయోలాజికల్ సైన్స్
➥ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్.
➥ ఏప్రిల్ 3న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్), ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు థియరీ పరీక్ష.
➥ ఏప్రిల్ 4న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్).
ఏపీలో కొనసాగుతున్న పరీక్షలు..
తెలంగాణలో మార్చి 21న పదోతరగతి పరీక్షలు ప్రారంభంకాగా.. ఏపీలో మార్చి 17న మొదలయ్యాయి. మార్చి 31 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఏపీలో సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

