Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Janasena: జగన్ ఆస్తుల్ని కాజేశారని బాలినేని ఆరోపించారు. జనసేన ప్లీనరీ సభలో ఆయన భావోద్వేగంతో ప్రసంగించారు.

Balineni accused Jagan looting assets: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విజయకేతనం సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు. సభలో ఆయన వైసీపీలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుని ఆయన ఆవేదనతో ప్రసంగించారు. ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ఆస్తులతో పాటు తన వియ్యంకుడి ఆస్తుల్ని జగన్ కాజేశారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తాను చెప్పిన ఈ విషయంపై చాలా మంది కౌంటర్లు ఇస్తారని .. దేనికైనా తాను సిద్దమని బాలినేని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తనకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. తాతల నుంచి వచ్చిన ఆస్తులన్నింటినీ పోగొట్టుకున్నానన్నారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వం, చంద్రబాబు విచారణ చేయించాలని కోరారు.
మొత్తం తాను చెప్పిన విషయాల్లో నిజాలు బయటకు వస్తాయన్నారు. అందర్నీ అడుగుతున్నాన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు తాము ఎదుర్కొన్న పరిస్థితులతో తమ కుటుంబం ఎంత బాధపడిందో తమకు తెలుసన్నారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ .. వైసీపీని విమర్శిస్తూ కూడా.. పవన్ తనను మంచోడన్నారని ఆయన భావోద్వేగానికి గురై కాసేపు మాట్లాడలేకపోయారు.
గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీలో చాలామంది వెధవలు ఉన్నప్పటికీ. బాలినేని వంటి వారు మంచివారు కూడా ఉన్నారని నా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పుడే జనసేనలోకి రావాల్సింది. ఆలస్యమైందన్నారు. ఒకటే విజ్ఞప్తి తప్పు చేసిన చిన్న కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నారని.. కానీ స్కీములు పేరుతో స్కాములు చేసి కోట్లు దోచుకున్న వారి దర్జాగా తిరుగుతున్నారని.. అటువంటి అవినీతిపరులు గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. మన నాయకుడు పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగారన్నారు. తనను జనసేనలోకి తీసుకువచ్చింది నాగబాబ అన్నారు. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతానని..నా మంత్రి పదవిని జగన్ తీసేశారు.. నేనేమీ బాధపడలేదన్నారు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అని జగన్ తెలుసుకోవాలన్నారు.
జనసేనలోకి తాను వస్తానంటే చాలా మంది వ్యతిరేకించారన్నారు బాలినేని. తాను కూటమిని విడదీసేందుకు వస్తున్నానని కూడా చెప్పారన్నారు. అలాంటివి ఎన్నటికీ చేయబోనని అన్నారు. తాను పవన్‌తో మాట్లాడినప్పుడు మీతో సినిమా తీయాలని ఉందని మాత్రమే చెప్పినట్టు తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకు పవన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. తనతో సినిమా తీస్తానని పవన్ మాట ఇచ్చారని తనకు ఆ ఒక్క గుర్తింపు చాలు అన్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ తో కలిసి పని చేశారు. ఆయన మంత్రివర్గంలో కూడా మినిస్టర్ గా పని చేశారు. వైఎస్ చనిపోయాక జగన్ వెంట నడిచారు. జగన్ గెలిచినప్పుడు తొలి రెండున్నరేళ్లు మంత్రిగా ఉన్నారు. అయితే ఆయనను తర్వాత జగన్ దూరం పెట్టారు. కానీ గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. అయితే ఓటమి తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు సమీప బంధువు. జగన్ తల్లి విజయమ్మ తరపు సమీప బంధువు. అయితే సమీప బంధువు అయినప్పటికీ జగన్ తన ఆస్తులు కాజేశారని బాలినేని ప్రకటించడం సంచలనంగా మారుతోంది.





















