Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Iran Israel War: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ముడిచమురులో 20 శాతం రవాణా అయ్యే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తూ ఆంక్షలు విధించగా.. త్వరలో ఇంటర్నెట్ పై ప్రభావం చూపుతుంది.

Iran-Israel War: పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన హర్ముజ్ జలసంధి (Hormuz Strait) మార్గాన్ని ఇరాన్ మూసివేసి ఆంక్షలు విధించింది. భారత్, చైనా లాంటి దేశాలకు ఇంధన సరఫరాకు ఇది చాలా ముఖ్యమైనది. కానీ ఇదే సమయంలో మరో డిజిటల్ సమస్య తలెత్తింది. భారత్‌కు ఈ ప్రాంతం రెండు సవాళ్లను విసురుతోంది: హర్ముజ్ నుంచే దేశానికి పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ వస్తుండగా, మరోవైపు ఇంటర్నెట్ డేటాను తీసుకెళ్లే కేబుల్స్ కూడా ఇదే ప్రాంతం నుంచి వెళుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితి తీవ్రమవుతున్న కొద్దీ, భారత్‌లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
సముద్రగర్భ కేబుల్స్‌కు ముప్పు
ప్రపంచంలోని సుమారు 99 శాతం అంతర్జాతీయ డేటా సముద్రం కింద ఏర్పాటు చేసిన ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే పంపుతున్నారు. భారత్‌కు సంబంధించిన డేటాలో సైతం అధికభాగం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నుండి వచ్చే ఇంటర్నెట్ ట్రాఫిక్, గల్ఫ్ ప్రాంతం ద్వారా వెళుతుంది. ముంబై, చెన్నైలను యూరప్, పశ్చిమాసియాతో అనుసంధానించే అనేక ముఖ్యమైన కేబుల్ వ్యవస్థలు ఈ మార్గం గుండానే వెళతాయి. వీటిలో SEA-ME-WE 4, I-ME-WE తో పాటు ALCON వంటి కేబుల్స్ ఉన్నాయి. ఈ కేబుల్స్ భారత డిజిటల్ నెట్‌వర్క్‌కు వెన్నెముకగా భావిస్తారు.
అయితే పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారడంతో ఈ సముద్రగర్భంలోని కేబుల్స్ మరమ్మతులు, నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2025 చివరలో జెడ్డా సమీపంలో కొన్ని కేబుల్స్ పాడైపోయిన తర్వాత మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. మిస్సైల్, డ్రోన్ దాడుల భయం కారణంగా మరమ్మతు నౌకలు పనులను నిలిపివేశాయి. ఈ పరిస్థితిలో ఏదైనా కేబుల్ తెగిపోతే, ఇంటర్నెట్ వేగం తగ్గిపోవచ్చు, కొన్నిచోట్ల ఇంటర్నెట్ నిలిచిపోయే ప్రమాదం సైతం లేకపోలేదు. దాంతోపాటు ఆర్థిక లావాదేవీలు లేదా డేటా సెంటర్ల వంటి రంగాలపై ప్రభావం పడవచ్చు.
ఇంధన సరఫరాపై పెరుగుతున్న ఒత్తిడి
భారత్ ఇప్పటికీ భారీ స్థాయిలో చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడి ఉంది. మార్చి 2026 నాటికి, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 50 నుండి 55 శాతం, సగానికి పైగా ఎల్ఎన్‌జి (LNG) షిప్‌మెంట్లు ఈ సముద్ర మార్గం ద్వారానే వస్తున్నాయి. కానీ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, తరువాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. భద్రతా కారణాలతో ఎన్నో ఆయిల్ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి బయలే ఆగిపోతున్నాయి. త్వరలో భారత్‌లోనూ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఎల్ఎన్‌జి విషయంలో పరిస్థితి మరింత సున్నితంగా కనిపిస్తోంది. భారత్‌కు అతిపెద్ద సరఫరాదారు ఖతార్. ఒకవేళ ఈ మార్గం మరింతకాలం పాటు నిలిపివేస్తే.. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల పరిశ్రమ వంటి కీలక రంగాలు ప్రభావితం కావచ్చు. ప్రస్తుతానికి భారత్ వద్ద వద్ద పరిమిత కాలానికి సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. కానీ సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే సవాళ్లు తప్పవు.
ఆర్థిక వ్యవస్థ, ఐటీ రంగంపై ప్రభావం
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రపంచ చమురు మార్కెట్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగితే, భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగవచ్చు. వీటితోపాటు భారత ఐటీ (IT), డిజిటల్ సర్వీస్ సెక్టార్ కూడా ఈ పరిస్థితి వల్ల ప్రభావితం కావచ్చు. డేటా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగితే రిమోట్ వర్క్, ఆన్‌లైన్ సేవలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి.
కొత్త ప్రత్యామ్నాయాల వేటలో భారత్
ఈ సవాలును ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఇంధన వనరులను, వాణిజ్య విధనాల్లో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తోంది. రష్యా, అమెరికా, ఇతర దేశాల నుండి చమురు దిగుమతులను పెంచడంపై భారత్ ఆలోచిస్తోంది. అలాగే, భారత్- మిడిల్ ఈస్ట్- యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC) వంటి భారీ ప్రాజెక్టులను తమకు ప్రత్యామ్నాయాలుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు




















