Jana Sena plenary : జనసేన కేడర్‌ను పట్టించుకోవడం లేదు- పవన్‌తో సినిమా తీస్తా: పిఠాపురం ప్లీనరీలో బాలినేని కీలక వ్యాఖ్యలు
Jana Sena plenary : జనసేన ప్లీనరీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ కేడర్ సమస్యలు, వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణలు, పవన్‌తో ఉన్న సంబంధంపై స్పందించారు.

Jana Sena plenary : పిఠాపురంలో జరుగుతున్న జనసేన ప్లీనరీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన కేడర్‌ను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని అన్నారు. తాను ఎలాంటి పదవులు ఆశించి జనసేనలోకి రాలేదని పునరుద్ఘాటించారు. కేవలం పవన్‌తో సినిమా చేయడానికే తాను వచ్చినట్టు తెలిపారు. జనసేనతో ట్రావెల్ అవ్వడానికి ఆ ఒక్క ఎచీవ్‌మెంట్ చాలని చెప్పారు.
పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీ లాంటి వాళ్లను ఉపేక్షించకూడదని అన్నారు. తనలాంటి వ్యక్తి అయితే అధికారంలోకి వచ్చిన రెండో రోజే లోపల వేయించేవాడినని అన్నారు. చంద్రబాబు, పవన్‌కు మానవత్వం ఉంది కాబట్టి 9 నెలలు ఒపిక పట్టారని అన్నారు.
కుటుంబాలపై, మహిళలపై నీచమైన కామెంట్స్ చేసిన వ్యక్తులను కూడా పరామర్శించే స్థాయికి జగన్ మోహన్ రెడ్డి దిగజారిపోయారని అన్నారు. ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్లను అనవసరంగా జైల్లో పెట్టి కొట్టించినప్పుడు నీతి ఏమైందని ప్రశ్నించారు.
చిన్న చిన్న కార్యకర్తలను లోపల వేస్తున్నారని కానీ పెద్ద పెద్ద స్కామ్‌లు చేసి కోట్లు వెనకేసుకున్న వాళ్లను వదిలేస్తున్నారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు వాళ్లపై కేసులు పెట్టి విచారణ చేయాలని సూచించారు. తనతోపాటు ప్రతి ఎమ్మెల్యేపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్ చాలా సార్లు వైసీపీ నేతలందర్నీ విమర్శించినా తనను ఎప్పుడూ తిట్టలేదని అన్నారు. ఇలాంటి మంచి వాళ్లు ఆ పార్టీలో ఉన్నారి చెప్పారని గుర్తు చేశారు. అప్పుటే జనసేనలో చేరాల్సింది అన్నారు. తప్పు చేశానని అన్నారు.
పవన్‌ను విమర్శించిన జగన్ మోహన్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదా అని ప్రశ్నించారు. భవిష్యత్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వగలరా అని సవాల్ చేశారు.
జనసేనలోకి తాను వస్తానంటే చాలా మంది వ్యతిరేకించారన్నారు బాలినేని. తాను కూటమిని విడదీసేందుకు వస్తున్నానని కూడా చెప్పారన్నారు. అలాంటివి ఎన్నటికీ చేయబోనని అన్నారు. తాను పవన్‌తో మాట్లాడినప్పుడు మీతో సినిమా తీయాలని ఉందని మాత్రమే చెప్పినట్టు తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకు పవన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. తనతో సినిమా తీస్తానని పవన్ మాట ఇచ్చారని తనకు ఆ ఒక్క గుర్తింపు చాలు అన్నారు.
జనసైనికులను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని అన్నారు బాలినేని. ఎమ్మెల్యేల విజయంలో వాళ్ల పాత్ర చాలా ఉందని వారికి గుర్తింపు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూర్చొని దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రేపు ఎన్నికల్లో విజయం సాధించాలంటే వాళ్లే కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. కేడర్‌కు గుర్తింపు ఇవ్వకుంటే ఏం జరుగుతుందో మొన్నటి ఎన్నికల్లో చూశామని వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ లీడర్‌కు, కేడర్‌కు గుర్తింపు ఉండదని విమర్శించారు.





















