AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Droupadi Murmu | డార్జిలింగ్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరైన ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.

అమరావతి: పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్‌లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంటర్నేషనల్ సంతాల్ కార్యక్రమానికి రాగా, బెంగాల్ ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం దురదృష్టకరం అన్నారు. తన పర్యటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి ముర్ము సైతం అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సైతం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ఇది బాధాకరమైన విషయమని, ఇలాంటివి సరికాదని హితవు పలికారు.

బెంగాల్ ప్రభుత్వ తీరు దురదృష్టకరం: ఏపీ సీఎం చంద్రబాబు
డార్జిలింగ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సంతాల్ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవర్తించడం దురుదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రపతి పదవిని అవమానించేలా బెంగాల్ ప్రభుత్వం వ్యహరించడం బాధకలిగించిందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాల్సి ఉందన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని హితవు పలికారు. రాష్ట్రపతి పదవిని గౌరవించుకోవడం సమిష్టి విధి అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పదవిని గౌరవించకపోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్
పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ముర్ముకు ఎదురైన పరిస్థితులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు నిర్వహణకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తం చేసిన బాధాకరమైన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. సంతాల్ కమ్యూనిటీ గొప్ప వారసత్వాన్ని జరుపుకునే కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు, ఆ సంస్కృతికి తగిన గౌరవం, భాగస్వామ్యం, మర్యాదలు అందేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చూడాలి.
Deeply concerned by the painful and sad remarks of Hon’ble President Smt. Droupadi Murmu Ji regarding the conduct of the International Santal Conference in Darjeeling, West Bengal . When an event celebrating the rich heritage of the Santhal community is organized, it should…
— Pawan Kalyan (@PawanKalyan) March 8, 2026
సంతాల్ కమ్యూనిటీ సభ్యుల కోసమే ఉద్దేశించిన ఈ సదస్సుకు, ఆ వర్గానికి చెందిన వారే హాజరైనప్పటికీ కష్టతరమైన పరిస్థితులు తలెత్తడం విచారకరం. ఇటువంటి సాంస్కృతిక సమావేశాలు అందరినీ కలుపుకుపోయేలా, సున్నితత్వంతో, సరైన పరిపాలనా ప్రణాళికతో ఉండాలి. రాష్ట్రపతి పదవి మన దేశంలో అత్యున్నత రాజ్యాంగ గౌరవాన్ని కలిగి ఉంది. ఆ పదవికి ఎల్లప్పుడూ తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలి. రాష్ట్రపతి ముర్ము పర్యటన అత్యంత గౌరవప్రదంగా జరిగేలా చూడటం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భారత్‌లోని గిరిజన సమాజాలు మన దేశ గుర్తింపు, గర్వంలో భాగం. కనుక వారి సంస్కృతి, సంప్రదాయాలు, గొంతుకలను ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో గౌరవించాలని’ పవన్ కళ్యాణ్ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
























