Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Andhra Pradesh Latest News: వైసీపీ నేతలకు, గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. సంక్షేమం మాత్రం రాజకీయాలకు అతీతంగా అందించాలని దిశానిర్దేశం చేశారు.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గెలుపు ఉత్సాహంలో ఉంది. నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీలుగా కొందరికి అవకాశం వచ్చింది. వివిధ మార్గాల్లో మిగతా నేతలకు ఎదిగే ఛాన్స్ దొరికింది. ఇలాంటి టైంలో ఇగోలతోనే, లేదా తమకు పదవులు దక్కలేదనో గ్రూప్ రాజకీయాలు మొదలు కానున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఈ ఉదయం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
గ్రూప్ రాజకీయలు వద్దు
కొత్తగా వివిధ పదవులకు ఎన్నికైన వాళ్లు, ఇంకా ఎదుగుతున్న వాళ్లు, క్షేత్రస్థాయి కార్యకర్తలను మిగతా నేతలను కలుపుకొని వెళ్లాలని టీడీపీ నాయకలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తున్న టైంలో అందరికీ హితబోధ చేశారు. గ్రూప్ రాజకీయాలు వద్దని హెచ్చరించారు. ఎవరు ఎక్కడకు వెళ్లి ఆ ప్రాంత నేతలకు సమాచారం ఇచ్చి పర్యటించాలని సూచించారు.
ముఖ్యంగా కీలక నేతలు జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో-ఆర్డినేటర్‌లు, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఇన్‍ఛార్జ్ మంత్రులు వారి జిల్లాలపై ఫోకస్ పెట్టాలని తెలిపారు. అక్కడ జరిగే అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలన్నారు. చిన్న సమస్యలు పెద్దగా అయ్యే వరకు ఉపేక్షించొద్దని వెంటనే పరిష్కార మార్గాలు చూడాలని హితవుపలికారు.
ఇన్‍ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు చంద్రబాబు. పర్యటనల సంఖ్య పెరగాలని చెప్పారు. కార్యకర్తలు నాయకులతో మమేకమవ్వాలన్నారు. జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలని చెప్పారు.
60వేల దరఖాస్తులు
నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ఇంకా కొనసాగుతున్నట్టు చెప్పారు. పేర్లు పంపించడంలో చాలా మంది లేట్ చేయడంతోనే ప్రక్రియ ఆలస్యమవుతుందని వివరించారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు సూచించారు. కష్టపడిన వాళ్లకు, పార్టీ కోసం కమిట్మెంట్‌తో ఉన్న వారినే సిఫార్సు చేయాలన్నారు. ఇప్పటికే 60వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. వాటిని స్క్రూట్నీ చేస్తున్నామని తెలిపారు. ఒకసారి ఒకరి పదవీ కాలం ముగిసిన తర్వాత మరొకరికి అవకాశం ఇస్తామని భరోసా ఇచ్చారు.
వైసీపీ నేతలతో సంబంధాలు వద్దు
వైసీపీ నేతలతో ఎవరూ సంబంధాలు పెట్టుకోవద్దని చంద్రబాబు నేరుగా చెప్పేశారు. ఈ విషయాన్ని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదని నేతలకు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించాలని సూచించారు. అంతే కానీ సంక్షేమాన్ని రాజకీయాన్ని కలపొద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలతో మాత్రం రాజకీయ సంబంధాలు ఉండకూడదని తేల్చి చెప్పారు.
కూటమి నేతల మధ్య కూడా సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎక్కడా భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలని దీనికి సీనియర్ నేతలు, మంత్రులు చొరవ తీసుకోవాలని చెప్పారు.





















