MLC Nagababu: ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
Janasena Nagababu | ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.

Andhra Pradesh MLC Elections | ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ జనసేన నేత నాగబాబు (Nagababu) పేరుపేరునా అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం కల్పించి నా బాధ్యతను పెంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
తనతో పాటుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కావలి గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు, బి. తిరుమల నాయుడు, రవిచంద్ర బీదకు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. పోటీ లేకుండానే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. ఒకవేళ ఎక్కువ నామినేషన్లు కనుక వచ్చింటే మార్చి 20న ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాల్సి వచ్చేది.
వారందరికీ నాగబాబు ధన్యవాదాలు
‘నామినేషన్ దాఖలు సందర్భంగా నాతో వెన్నంటి ఉన్న రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, బీజేపీ శాసనపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకి ప్రత్యేకమైన అభినందనలు. నా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరవు విజయ్ కుమార్, వత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీకి అభినందనలు. నా ఇన్నేళ్ళ రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులకు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మొత్తం జనసేన కుటుంబానికి ఆత్మీయ అభినందనలు’ అని నాగబాబు పోస్ట్ చేశారు.

నేడు జనసేన ప్లీనరీ..
ఏపీలో 2019 ఎన్నికల్లో ఒక్క సీటు నెగ్గిన జనసేన.. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నాడు. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా గెలుపొందారు. కొన్ని నెలల కిందటే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటన చేశారు. అటు తమ్ముడు పవన్ ఎమ్మెల్యే, మంత్రికాగా, ఇటు అన్న నాగబాబు ఎమ్మెల్సీ (త్వరలో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న) సంతోషకర సమయంలో జనసేన ప్లీనరీ జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో 50 ఎకరాలలో జనసేన 12వ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు.






















