Tirumala No Fly Zone: తిరుమల ఆలయం పైనుంచి వెళ్తున్న విమానాలు, టీటీడీ రిక్వెస్ట్ కేంద్రం పట్టించుకోలేదా?
No Fly zone over Tirumala | తిరుమల ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధం అని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ రిక్వెస్టును కేంద్రం పట్టించుకోవడం లేదు.

Tirumala News | తిరుమల: ఏదో అంశంపై తిరుమల శ్రీవారి ఆలయం వార్తలో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా శ్రీవారి ఆలయం వద్ద మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఒక్కరోజే శ్రీవారి ఆలయం గోపురం గోపురం మీద, అతీ సమీపం నుంచి ఏకంగా 8 విమానాలు వెళ్లడంతో భక్తులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఉదయం 7:15 నుంచి 8 గంటల మధ్యన విమానాలు వెళ్లాయని అధికారులు తెలిపారు.
టీటీడీ కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదా?
ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం పరిసరాలు నో ఫ్లైయింగ్ జోన్ అనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఉదయం సమయంలో ఎనిమిది విమానాలు శ్రీవారి ఆలయం మీద నుంచి వెళ్లాయి. దాంతో దీనికి పరిష్కారం ఏంటని చర్చ మొదలైంది. గతంలోనే టీటీడీ పలుమార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సైతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి లేఖ సైతం రాయడం తెలిసిందే. కూటమి నేత రామ్మోహన్ నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నా ప్రయోజనం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ టీడీపీ నేడ అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటనపై అడుగులు పడలేదు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి అయినా తిరుమల అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ నేతల సిఫార్సులంటే లెక్కే లేదా..
కాగా, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేయడంతో సిఫార్సు లేఖలు అనుమతి ఇస్తామని సైతం ప్రకటించారు. కానీ నెలన్నర రోజులు గడిచినా అది అమల్లోకి వచ్చినట్లు కనిపించడం లేదు. దాంతో తిరుమలకు వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారిచ్చే సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని, ఇది చాలా బాధాకరం అని తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి నిదర్శనంగా చెప్పవచ్చు.






















