Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమలలో గౌరవం దక్కడం లేదని, మా సిఫార్సు లేఖలు అనుమతించడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల: తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సమస్యలు తప్పడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారైంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలలో పట్టించుకోవడం లేదు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం రఘునందన్ రావు పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సులను తిరుమలలో తీసుకుంటామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమలవుతుందని ఏపీ ప్రభుత్వం, టీటీడీ సైతం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి అనుమతి ఇచ్చేవారు. కానీ రాష్ట్ర విభజన నుంచి తిరుమలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తిరుమలలో కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణనలోకి తీసుకుంటుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సులను ఆమోదిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సైతం చెప్పారు. లేఖలు ఇవ్వండి, అకామడేషన్ ఇస్తామంటారు. లేఖలు సిఫార్సు చేస్తే పరిగణనలోకి తీసుకోవడం లేదు. మార్చి నెల సగం పూర్తయింది. ఇంకా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలతో వచ్చే వారికి ఎలాంటి అనుమతి, సదుపాయాలు కల్పించడం లేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఉమ్మడి ఏపీలో 294 మంది సిఫార్సు లేఖలు ఆమోదించిన టీటీడీ.. ఇప్పుడు కేవలం ఏపీ నేతల లేఖల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలి’ అని ఎంపీ రఘునందన్ రావు కోరారు.






















