Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
TTD News: డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. టోకెన్లు ఎలా తీసుకోవాలంటే...

Tirumala vaikunta dwara darshan: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది సామాన్యులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం, భక్తులకు దైవదర్శన సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు TTD ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పవిత్ర ఉత్సవం డిసెంబర్ 30, 2025 నుంచి జనవరి 8, 2026 వరకు 10 రోజుల పాటు జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని, భక్తులకు మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రరోజుల్లో మొత్తం 8 లక్షల మంది భక్తులకు దర్శనం అందించేందుకు 182 గంటల సమయాన్ని కేటాయించారు, వాటిలో 164 గంటలు సామాన్య భక్తులకు మాత్రమే.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి TTD పలు మార్పులు చేస్తోంది. ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించారు. గతంలో ఉదయం నుంచే జరిగేవి ఈసారి మధ్యాహ్నం, సాయంత్రాలకు మార్చారు, తద్వారా సాధారణ భక్తుల వేచి ఉండే సమయం తగ్గుతుంది. ప్రొటోకాల్ వారికి మాత్రమే ప్రత్యేక దర్శనాలు కల్పిస్తారు. తొలిరోజు వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని 4 గంటల 45 నిమిషాలకు, ఇతర రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు పరిమితం చేశారు.
మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30 - ఏకాదశి, 31 - ద్వాదశి, జనవరి 1 - త్రయోదశి) సర్వదర్శనానికి మాత్రమే పరిమితం. ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఈ-డిప్ టోకెన్ దారులకు మాత్రమే అనుమతి. రిజిస్ట్రేషన్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా వైకుంఠ దర్శన యాప్ ద్వారా చేయవచ్చు. ప్రతి రిజిస్ట్రేషన్‌లో నాలుగు మంది వరకు చేర్చుకోవచ్చు. డిసెంబర్ 2న ఏఐ సిస్టమ్ ద్వారా రాండమ్‌గా ఎంపిక చేస్తారు: ఏకాదశికి 70 వేలు, ద్వాదశికి 75 వేలు, త్రయోదశికి 68 వేల టోకెన్లు కేటాయిస్తారు. ఈ మూడు రోజుల్లో టోకెన్ లేకుండా వచ్చినవారిని దర్శానికి అనుమతించరు.
జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం బహుళ భక్తులకు అందుబాటులో ఉంటుంది. రోజుకు 15 వేల రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు, వెయ్యి శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జనవరి 6,7,8న తిరుపతి, తిరుమల స్థానికులకు రోజుకు 5 వేల టోకెన్లు ఫస్ట్-కమ్ ఫస్ట్-సర్వ్ పద్ధతిలో ఆన్‌లైన్ బుకింగ్. మొత్తంగా, భక్తుల సౌకర్యార్థం భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రత్యేక చట్టపరమైన కమిటీని ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసి, టోకెన్ పొంది వచ్చినప్పుడే దర్శనం సులభం అవుతుంది. టీటీడీ యాప్ ద్వారా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా! ఈ లింక్ క్లిక్ చేయండి






















