Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Nicolas Maduro Guerra Warning:వెనిజులాలో అమెరికా చర్యలపై మదురో కొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ద్రోహి ఎవరో చరిత్ర చెబుతుందని అన్నారు.

Nicolas Maduro Guerra Warning: వెనిజులాలో నాలుగు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికాకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని, వెనుజులా మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిందని చెబుతూ అమెరికా ఆ దేశంలో సైనిక చర్య చేపట్టింది. అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అరెస్టు చేసింది. దీనిపై మదురో కుమారుడు నికోలస్ మదురో గెర్రా కీలక ప్రకటన చేశారు. కొందరు వెనిజులాను మోసం చేశారని, భవిష్యత్తులో ఆ ముఖాలు ఎవరివో ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో విడుదలైన ఆడియో రికార్డింగ్‌లో, ద్రోహులు ఎవరో చరిత్ర చెబుతుందని, చరిత్ర దానిని వెల్లడిస్తుందని ఆయన అన్నారు.
మదురో గెర్రా మాట్లాడుతూ, 'వారు మనల్ని బలహీనంగా చూడాలనుకుంటున్నారు. మనం గౌరవం, ఆత్మ గౌరవం పతాకాలను ఎగురవేస్తాము. ఇది మనకు బాధ కలిగిస్తుందా? కచ్చితంగా బాధ కలిగిస్తుంది, మనకు కోపం వస్తుంది, కానీ వారు విజయం సాధించలేరు, శపానికి గురి అవుతారు. నా జీవితం, నా తల్లి సిలియా మీద ఒట్టు, వారు అలా చేయలేరు.' నికోలస్ మదురో కుమారుడు గెర్రా తన మద్దతుదారులను జనవరి 4-5 తేదీలలో బహిరంగ ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు, తద్వారా వారు నాయకత్వం చుట్టూ గుమిగూడి ఐక్యతను బలోపేతం చేయగలరు అని అన్నారు.
మదురో గెర్రా వెనిజులా అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ (PSUV) సభ్యుడు. గెర్రా ఒక పెద్ద డ్రగ్ నెట్‌వర్క్‌కు ప్రధాన సూత్రధారి అని, వెనిజులా నుంచి అమెరికా వరకు మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి ప్రభుత్వ ఆస్తులు, సైన్యం రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకున్నారని అమెరికన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు.
నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ ప్రస్తుతం అమెరికాలో అదుపులో ఉన్నారు. వారిని సోమవారం (జనవరి 5, 2026) న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపరుస్తారు. వారిపై అమెరికా నార్కో-టెర్రరిజం, డ్రగ్స్ స్మగ్లింగ్ కుట్ర ఆరోపణలు ఉన్నాయి.





















