Causes of Snoring : గురక ఎక్కువగా వస్తుందా? కారణాలు ఇవే.. తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Snoring : గురకపట్టి నిద్రపోయా అని చెప్తే అది మంచి నిద్ర అనుకోవాలా? లేక ఆరోగ్య సమస్యలకు సంకేతం అనుకోవాలా? అసలు గురకకు కారణాలు ఏంటి? తగ్గించుకోవచ్చా?

Remedies for Snoring : చాలామందిలో చాలా కామన్‌గా కనిపించే సమస్యల్లో గురక ఒకటి. ఇది నిద్రపోయే వారికే కాదు.. పక్కనున్నవారికి ఇబ్బందిని కలిగిస్తుంది. కానీ కొందరు మాత్రం అబ్బా ఈరోజు గురకపెట్టి నిద్రపోయాను అని చాలా సంతోషంగా చెప్తారు. బాగా కష్టపడితే గురకవస్తుందని.. గురక మంచి నిద్రకు సూచనగా చెప్తారు. నిజంగానే ఇది గాఢ నిద్రను సూచిస్తుందా? అంటే కచ్చితంగా నో అంటున్నారు నిపుణులు. ఇది శరీరంలో ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతంగా చెప్తున్నారు. గురక రావడానికి కారణాలు ఏంటో.. దానిని కంట్రోల్ చేయొచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
గురక రావడానికి కారణాలివే..
ముక్కు దిబ్బడ : నాసిక రంధ్రాలు మూసుకుపోవడం, టాన్సిల్స్, అడినాయిడ్స్, జలుబు వంటివి వాటి వల్ల శ్వాసకు ఇబ్బంది కలుగుతుంది. ఇది నోటి శ్వాసకు దారితీసి గురకను పెంచుతుంది.
గొంతు కండరాల్లో మార్పు : గొంతు కండరాలు సడలినప్పుడు వాయుమార్గం ఇరుకుగా మారుతుంది. దీనివల్ల కణజాలాలు కంపిస్తాయి. ఇది గురక శబ్ధాలను ఉత్పత్తి చేస్తుంది.
అధిక బరువు : ఊబకాయం, అధిక బరువు వల్ల గొంతులో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల వాయుమార్గం ఇరుకుగా మారి గురకను పెంచుతుంది.
నిద్రపోయే విధానం : వీపుపై పడుకున్నప్పుడు నాలుక అంగిలి వెనక్కి పడి వాయుమార్గాన్ని అడ్డుకుంటుంది. ఇది గురకకు దారి తీస్తుంది.
వృద్ధాప్యం : వయసు పెరిగే కొద్ది వాయుమార్గాలు ఇరుకైపోతాయి. ఇది గురక సమస్యను పెంచుతుంది.
అలెర్జీలు : అలెర్జీల వల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, జలుబు సమస్యలు రావడం జరుగుతాయి. దీనివల్ల నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఇది గురకకు దారితీస్తుంది.
ఇవేకాకుండా నిద్ర సమస్యలు ఉన్నవారిలో, స్లీప్ ఆప్నియాతో ఇబ్బంది పడేవారికి కూడా గురక వస్తుంది. మత్తుమందులు, యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులు గొంతు కండరాల్లో మార్పులు తీసుకువచ్చి గురకను ప్రేరేపిస్తాయి.
నివారణ చిట్కాలు..
మీరు గురకను రాకుండా ఉండాలి అనుకుంటే బరువు తగ్గాలి. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తే గురక తగ్గుతుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల గొంతు కండరాలకు బలం చేకూరుతుంది. గురక కంట్రోల్ అవుతుంది. వీపుపై కాకుండా పక్కకి తిరిగి పడుకోండి. ఇది కూడా మంచి ఆప్షన్. మీ బెడ్ నుంచి 4 నుంచి 6 అంగుళాల ఎత్తులో తలను ఉంచండి. దీనివల్ల కూడా గురక కంట్రోల్ అవుతుంది. మద్యం కూడా తీసుకోకపోవడమే మంచిది.
ఇంటి చిట్కాలు..
ముక్కు దిబ్బడ సమస్యతో గురక వస్తుందనుకుంటే.. నాసల్ స్ట్రిప్స్ వేసుకోవచ్చు. లేదా నాసికా మార్గాలను వెట్ చేయడానికి సెలైన్ నాసల్ స్ప్రే వాడొచ్చు. హ్యూమిడిఫైయర్ గాలిని తేమగా చేసి.. గురకను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. గొంతుకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ ట్రై చేసినా.. గురక తగ్గట్లేదు అంటే కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి. ఏ కారణం వల్ల గురక వస్తుందో గుర్తించి.. దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు.
Also Read : ఉదయాన్నే ముఖం ఉబ్బినట్టు కనిపిస్తోందా? అయితే కిడ్నీ సమస్యలు కావొచ్చు, ఇవి కూడా దాని లక్షణాలే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

