Adilabad News: స్కూల్లో విషప్రయోగం, ప్రిన్సిపాల్ అప్రమత్తతతో విద్యార్థులకు తప్పిన ముప్పు
Telangana News | ఇచ్చోడ మండంలోని ధర్మపురిలో ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. గుర్తుతెలియని దుండగులు విద్యార్థులు నీళ్లు తాగే ట్యాంకులో పురుగుల మందు కలిపారు.

Poison mixed in Water Tank at Govt School in Dharmapuri in Adilabad District
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విష ప్రయోగం చేయడం కలకలం రేపింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులు మంచినీళ్లు తాగే ట్యాంకులో విషం కలిపారు. మధ్యాహ్న భోజనం వండాల్సిన వంట సామాగ్రికి సైతం పురుగుల మందు పూశారు. విషయం గమనించిన ప్రిన్సిపాల్ అప్రమత్తం కావడంతో 30 మంది విద్యార్థులకు ముప్పు తప్పింది.
అసలేం జరిగిందంటే..
ఇచ్చోడ మండలంలోని ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బా కనిపించడంతో ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తం అయ్యారు. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో స్కూల్ వంట గదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం స్కూ్ల్ ఉందని కిచెన్ తెరవగా పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమై పిల్లలను మంచి నీళ్లు తాగే ట్యాంకు, నల్లాల వైపు వెళ్లనివ్వలేదు. అదే విధంగా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఈ విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయట పడడంతో గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకున్నారు.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్
మధ్యాహ్న భోజనం చేసే పాత్రలలో సైతం దుండగులు విషం పూశారు. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూలు పిల్లలు చనిపోవాలని పరుగుల మందు ఎవరు కలిపారు, ఎవరికి ఈ అవసరం వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల దౌర్భాగ్యపు బుద్ధి వలన ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని.. వారిని గుర్తించి అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అసలే గత కొన్ని నెలలుగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో సరైన తిండి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం విమర్శలకు దారితీసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్ కు తరలించి చికిత్స చేయించినా ప్రాణాలు దక్కలేదు. పలు గురుకుల, సోషల్ వెల్ఫేర్, ఇతర ప్రభుత్వ స్కూల్ హాస్టల్స్ లో నాసిరకం భోజనం పెడుతున్నారని కొన్ని రోజుల కిందట ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.





















