Inflation in India: 67 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం, ఇప్పుడు ఏం జరుగుతుంది?
Retail Inflation Rate: తృణధాన్యాల ద్రవ్యోల్బణం 5.93 శాతంగా ఉండగా, పప్పు ధాన్యాల ధరలు 2.73 శాతం తగ్గాయి. అయితే, అమెరికా సుంకాల ముప్పు వెంటాడుతూనే ఉంది.

Retail Inflation At 67 Months Low In March 2025: కామన్ మ్యాన్‌కి ఇది కచ్చితంగా పెద్ద ఉపశమనం. మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది, 2025 మార్చిలో కేవలం 3.34 శాతంగా నమోదైంది. 2019 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య. ఈ ఏడాది ఫిబ్రవరిలో చిల్లర ద్రవ్యోల్బణం రేటు 3.61 శాతంగా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం, 2024 మార్చిలో ఇది 4.85 శాతంగా నమోదైంది.
నెల ప్రాతిపదికన, సంవత్సరం ప్రాతిపదికన తగ్గుదల
భారత ప్రభుత్వం మంగళవారం (15 మార్చి 2025) విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల మార్చి నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ దిగి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతో పోల్చినా, ఏడాది క్రితంతో పోల్చినా ఇప్పుడు ద్రవ్యోల్బణం రేటు మరింత తగ్గుదలను చూసింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలోనూ భారత్‌లో ద్రవ్యోల్బణం తగ్గడం విశేషం.
ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం
మార్చి నెల ద్రవ్యోల్బణం గణాంకాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 'లక్ష్యిత పరిధి' అయిన 2-6 శాతం మధ్యలో ఉండటమే కాకుండా, RBI లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువగానే నమోదైంది. ఇది ఆర్థిక వ్యవస్థలో సానుకూలతకు శుభ సంకేతం.
ఆహార పదార్థాల విషయానికి వస్తే... ఫిబ్రవరిలో 3.75 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation) మార్చి నెలలో 2.69 శాతానికి తగ్గింది. 2024 మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 8.52 శాతంగా లెక్క తేలింది.
మార్చి నెలలో, కూరగాయల ధరల ద్రవ్యోల్బణంలో పెద్ద పతనం కనిపించింది. ఇది, ఫిబ్రవరిలో -1.07 శాతంగా ఉంటే, మార్చిలో -7.04 శాతానికి పడిపోయింది. ఇలా 'మైనస్' గుర్తుతో నమోదు కావడాన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటారు.
మార్చి నెలలో కోడిగుడ్లు (-3.16 శాతం), సుగంధ ద్రవ్యాలలోనూ (-4.92) పతిద్రవ్యోల్బణం నమోదైంది. అయితే, నూనెలు & కొవ్వులు (17.07 శాతం) మాత్రం అధిక ధరల వద్దే కొనసాగుతున్నాయి, పండ్ల ద్రవ్యోల్బణం 16.27 శాతంగా నమోదైంది.
సామాన్యుడి ఉపశమనం
మార్చి నెలలో, తృణధాన్యాల ద్రవ్యోల్బణం 5.93 శాతంగా నమోదైంది, పప్పుధాన్యాల ధరలు 2.73 శాతం తగ్గాయి. శాఖాహారంపై ఆధారపడే సామాన్యులకు ఇది పెద్ద ఉపశమనం. ఇంధనం & విద్యుత్ ద్రవ్యోల్బణం కూడా 1.48 శాతానికి దిగి వచ్చింది.
భారతదేశ గ్రామీణ ప్రాంతాలు & పట్టణ ప్రాంతాలలో కూడా ఇన్‌ఫ్లేషన్ రేటు శాంతించింది. ఫిబ్రవరిలో గ్రామీణ ద్రవ్యోల్బణం 3.79 శాతంగా ఉండగా, మార్చిలో అది 3.25 శాతానికి తగ్గింది. పట్టణ ద్రవ్యోల్బణం కూడా 2.48 శాతానికి తగ్గింది.
టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా 2025 మార్చి నెలలో 2.05 శాతానికి తగ్గింది, ఇది ఫిబ్రవరిలో 2.38 శాతంగా ఉంది. గత ఏడాది మార్చిలో ఇది 0.26 శాతంగా నమోదైంది.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత స్థాయిలోనే ఉండడం వల్ల, ఈ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు మరింత తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన RBI MPC సమావేశంలో, రెపో రేటును మరో 0.25% కోత విధించి 6%కు తగ్గించారు. ద్రవ్యోల్బణంలో డౌన్ ట్రెండ్ కొనసాగుతుందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) మరింత ఉపశమనం లభించవచ్చని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆ సమావేశంలో వెల్లడించారు. ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటే, కుటుంబాలపై ఖర్చుల ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. అయితే, అమెరికా పెంచిన సుంకాలు వంటి ప్రపంచ అనిశ్చితులు ఇప్పటికీ పెద్ద ముప్పుగా ఉన్నాయని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ సహా చాలా దేశాలపై 26 శాతం దిగుమతి సుంకం విధించారు. అయితే, చైనా తప్ప మిగతా దేశాలకు 90 రోజుల ఉపశమనం ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

