SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?
ఈ ఏడాది ఇది చేసేస్తారు అది చేసేస్తారు 300 పగులగొట్టేస్తారు అని అందరూ కలలుకన్న ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్ లో ఆరామ్ గా నిద్రపోతోంది. ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 2 మాత్రమే గెలిచి...నిన్నొదిలి నేనుండలేను అంటూ చెన్నైతో ఈ సీజన్ అంతా ముందుకు వెనక్కు సాగుతోంది SRH. అలాంటి సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఈ రోజు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఉంది. వరుసగా మూడు మ్యాచులు గెలిచి జోరు మీదుంది ముంబై సేన. ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను మట్టికరిపించి ఇప్పుడు హైదరాబాద్ ని హైదరాబాద్ లోనే ఓడించాలనే కృత నిశ్చయంతో వచ్చింది ముంబై ఇండియన్స్. ప్రధానంగా వాళ్ల బలం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేయటం. పైగా సూర్య కుమార్ యాదవ్ కూడా మంచి టచ్ లో ఉండటంతో ముంబై బ్యాటింగ్ కష్టాలు తీరినట్లే. మిగిలిన పనిని చూసుకోవటానికి రికెల్టన్, విల్ జాక్స్, తిలక్మ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక బౌలింగ్ లో బూమ్ బూమ్ బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్ ఇలా కావల్సినంత బలం ఉంది. శాంట్నర్ స్పిన్ బాధ్యతలు చూసుకుంటాడు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఎవరూ ఆడకపోవటమే ఇప్పటి వరకూ ఇబ్బంది. ఆడితే ఇరగదీయటానికి బోలెడు మంది ఉన్నారు. హెడ్ అభిషేక్ శర్మ దగ్గర మొదలుపెడితే క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ వరకూ అందరూ టాప్ ప్లేయర్లే. కానీ టైమ్ కలిసిరావట్లేదు అంతే. బౌలింగ్ బాధ్యతలు చూసుకోవటానికి ప్యాట్ కమిన్స్, షమీ ఉన్నారు, స్పిన్ బాధ్యతలను జీషన్ అన్సారీ చూసుకుంటున్నాడు. చూడాలి ఈ రోజు మ్యాచ్ తోనైనా హైదరాబాద్ విన్నింగ్ స్ట్రీక్ లో పడుతోందో లేదా ముంబైకే నాలుగో విజయాన్ని కట్టబెడుతుందో చూడాలి.





















