Chandrababu: రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Finance Commission: ఏపీకి అండగా నిలబడాలని ఆర్థిక సంఘాన్ని చంద్రబాబు కోరారు. నేడు మీరు సాయం చేసి నిలబెడితే... రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటామన్నారు.

Finance Commission Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని... దృఢమైన నిర్ణయాలతో, ఉత్తమ పాలసీలతో పాలన సాగిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామని సీఎం అన్నారు. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్‌కు అనేక సమస్యలు ఉన్నాయని సీఎం వివరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో ఐదేళ్లూ తీవ్ర నష్టం
2019 తరువాత నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సీఎం వివరించారు. గత 10 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. పనగారియా నీతి ఆయోగ్‌లో పని చేసిన సమయంలోనే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారు. దేశంలో ఉన్న ఇతర జాతీయ ప్రాజెక్టుల పురోగతి మందగించడంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని సిఫారసు చేశారు. వచ్చే పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీరు కూడా రావాలని కోరుతున్నాను” అని సిఎం అన్నారు. అప్పుల కోసం గత ప్రభుత్వం తహసీల్దార్ ఆఫీస్ లు కూడా తాకట్టు పెట్టింది. 25 ఏళ్లకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టింది. ఇలాంటి సమస్యల నుంచి బయటకు వచ్చి రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం. సంక్షేమ, అభివృద్ది బ్యాలెన్స్ చేసుకుంటూ.....సుపరిపాలన అందిస్తున్నాం. ఇలాంటి సమయంలో...ఈ రోజు మేం నిలబడేందుకు, ముందుకు వెళ్లేందుకు మీరు సాయం చేస్తే...రేపు పుంజుకుని మాకున్న బలం ద్వారా అనూహ్య విజయాలు సాధిస్తాం అని ముఖ్యమంత్రి వివరించారు.
ఏపీ వృద్ధికి అనుకూలతలు :
అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ తూర్పు దేశాలకు గేట్‌వేగా ఉంది. 3 పారిశ్రామిక కారిడార్లు, విశాఖ-చెన్నయ్, చెన్నయ్-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్లు ఉన్నాయి. 6 పోర్టులు, 7 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. దేశ ఎగుమతుల్లో 5.8 శాతం రాష్ట్రం నుంచే అవుతున్నాయి. బ్లూ ఎకానమి, ఐటీ, నాలెడ్జ్ ఎకానమి, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్, ఐవోటీ, బ్లాక్ చెయిన్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం ముందుంది. గ్రీన్ హైడ్రోజన్, సోలార్, అమోనియా... ఇలా గ్రీన్ ఎనర్జీకి ఏపీ హబ్‌గా ఉంది. అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి నగరాలు అమరావతికి చేరువలో ఉన్నాయి. ఈ నాలుగు నగరాలను కలుపుతూ దక్షిణ భారత దేశం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తే వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం అవుతుందన్నారు. జీరో పావర్టీ లక్ష్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను...అత్యున్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది సంపన్నులు ఆదుకేనే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో అసమానతలు తొలిగేలా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. జనాభా వృద్ధిపైనా దృష్టి సారించామని తెలిపారు.
ఇవీ ఆంధ్రప్రదేశ్ అవసరాలు :
1. పోలవరం-బనకచర్ల అనుసంధానం
2. తాగునీటి ప్రాజెక్టులు
3. 5 పర్యాటక హబ్‌లు(అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం) ఐఐటీ తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంబర్, బుద్ధిస్ట్ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు
4. నాలెడ్జ్ ఎకానమీలో భాగమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్ డెవలప్మెంట్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 100 శాతం అక్షరాస్యత
5. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, ఇన్‌ల్యాండ్ వాటర్ వేలు, రహదారులు
6. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి రీజనల్ గ్రోత్ సెంటర్లు... ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు ఇచ్చేలా సిఫారసులు చేయాలని ఆర్ధిక సంఘాన్ని ముఖ్యమంత్రి కోరారు.
16వ ఆర్థిక సంఘం సభ్యుల తో సచివాలయంలో నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.#AndhraPradesh pic.twitter.com/ZPsY4Sj9A9
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 16, 2025
వాట్సప్ గవర్నెన్స్‌కు హ్యాట్సాఫ్ :
వివిధ అంశాలపై ఆర్థిక సంఘం తమ అభిప్రాయాలు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై చైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు ప్రశంసలు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారా అని సీఎంను పనగరియా అడిగారు... ఇంకా లేదని, వచ్చే నెలలో ప్రధానితో భేటీ సందర్భంగా ఆయనకు ఈ ప్రాజెక్ట్‌పై వివరిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ సేవలకు కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ వాట్సాప్ ద్వారా సేవలు పొందే పరిస్థితి తీసుకువస్తున్నామని రానున్న రోజుల్లో 1000 సేవలు అందిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆర్ధిక అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వడం తమను ఎంతో ఆశ్చర్య పరిచిందని, వృద్ధి గణాంకాలపై ఇంత లోతుగా విశ్లేషించడం, కేంద్ర సాయం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను పనగారియా ప్రశంసించారు. మరోవైపు 30 ఏళ్ల క్రితం తాను హైదరాబాద్ వెళ్లిన నాటికి... నేటికీ ఎంతో అభివృద్ధి చెందిందని.. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని ఆర్ధిక సంఘం సభ్యురాలు అన్నెజార్జ్ మాథ్యూ అన్నారు. అమరావతి కూడా అదే స్థాయిలో చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.





















